Delhi Assembly Election : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ మరో మ్యానిఫెస్టోని విడుదల చేసింది. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు రూ.15 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని ప్రకటించింది. ఈ మేరకు సంకల్ప పత్రను ఎంపీ అనురాగ్ ఠాకూర్ మంగళవారం విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే నిరుపేద విద్యార్థులకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చింది. బీఆర్ అంబేడ్కర్ స్టైపెండ్ పథకం కింద ఐటీఐ, పాలిటెక్నిక్ నైపుణ్య కేంద్రాల్లో సాంకేతిక కోర్సులు అభ్యసించే షెడ్యూల్డ్ కులాలకు చెందిన విద్యార్థులకు ప్రతి నెలా రూ.1,000 అందించనున్నట్లు తెలిపింది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, స్టేట్ పీసీఎస్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని ప్రకటించిన బీజేపీ, రెండు అటెంప్ట్ల వరకు రూ.15,000 అందించనున్నట్లు వెల్లడించింది. ఆటో-టాక్సీ డ్రైవర్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ, డ్రైవర్లకు రూ.10 లక్షల జీవిత బీమా, రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పించనున్నట్లు హామీ ఇచ్చింది. అవే ప్రయోజనాలతో గృహ కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసే ప్రణాళిక ఉన్నట్లు తెలిపింది.
ఇక, బీజేపీ మ్యానిఫెస్టో పై మాజీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను నిలిపివేయాలని, మొహల్లా క్లినిక్‌లతో సహా ఉచిత ఆరోగ్య సేవలను రద్దు చేయాలని పార్టీ యోచిస్తోందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీకి మద్దతు ఇవ్వకూడదని ఓటర్లను కోరారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రమాదకరమని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
Read Also:Hydra Police Station : ఇదిగో హైడ్రా పోలీస్ స్టేషన్.. పరిశీలించిన కమిషనర్ ఏవీ రంగనాథ్