తెలంగాణలోని హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను గురువారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఉమ్మడి ఏపీ విభజనపై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, బుధవారం తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు మోదీ వ్యాఖ్యలకు నిరసనగా పలు చోట్లు ఆందోళణలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో మరోవైపు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆందోళణలు చేపట్టారు.
దీంతో ఇరు పార్టీల నిరసనల్లో భాగంగా పలుచోట్లు ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో జనగామలో బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు నిరసనగా జనగామలో గురువారం బీజేపీ మౌనదీక్షకు పిలుపునిచ్చింది. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన, బీజేపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జనగామ వెళ్ళేందుకు ప్రయత్నించగా, విషయం తెలుసుకున్న పోలీసులు ఈటల రాజేందర్‌ను హౌస్ అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు ఉన్న నేపధ్యంలో, బీజేపీ పార్టీ పిలుపునిచ్చిన మౌన దీక్షకు అనుమతి లేదని పోలీసులు ఈటల రాజేందర్‌ను హైదరాబాద్‌లో గృహ నిర్బంధం చేశారు. దీంతో పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈటెల రాజేందర్.. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన హక్కులు ఉంటాయన్నారు. నిరసనలు, బంద్‌లు చేసేందుకు టీఆర్ఎస్ పార్టీకీ మాత్రమే అనుమతిస్తారా, దాడులు చేసిన వారి పక్షాన పోలీసులు నిలుస్తారా అంటూ ఈటెల మండిపడ్డారు. కనీసం దెబ్బలు తిన్నవారిని పరామర్శించే స్వేచ్ఛ కూడా రాష్ట్రంలో లేదా అని కేసీఆర్ సర్కార్‌ని ప్రశ్నించారు. మరోవైపు, గోశామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు.