BJP: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్.. గెలుపే లక్ష్యంగా ముందడుగులు

  • Written By:
  • Publish Date - March 5, 2024 / 12:34 AM IST

BJP: తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ఖర్చు లెక్కలపై ఆరా తీస్తోంది. ఎన్నికల సందర్భంగా వచ్చిన పార్టీ ఫండ్ దారితప్పిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయమై పలువురు బీజేపీ అభ్యర్థులు హస్తినకు ఫిర్యాదులు చేశారు. పార్టీ హైకమాండ్ ఇచ్చిన నిధులు కింది వరకు అందకపోవడంతో.. చాలా సెగ్మెంట్లలో పార్టీ ఓడిపోయిందని వారు అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్లారట. రాష్ట్రానికి చెందిన పలువురు నేతల ఫిర్యాదు మేరకు నిధుల సంగతి తేల్చేందుకు తెలంగాణలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చెందిన షాడో టీమ్ రంగంలోకి దిగిందని చెబుతున్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను మూడు కేటగిరీలుగా విభజించి ఫండ్ కేటాయించిందని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. నియోజకవర్గాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారని వారు వెల్లడించారు. ఏ కేటగిరీ అంటే గెలిచేదిగా, బీ అంటే కొంచెం కష్టపడితే గెలిచేదిగా, సీ కేటగిరి అంటే గెలిచే ఛాన్స్ లేకపోయినా.. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడమే లక్ష్యం. అయితే పార్టీకి ఏమాత్రం బలం లేని పలు అసెంబ్లీ సెగ్మెంట్లకు భారీగా నిధులు సమకూర్చారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

అదే గెలుపునకు దగ్గరలో ఉన్నారనుకున్న సెగ్మెంట్లకు చాలా తక్కువ నిధులు కేటాయించడంతో ఓటమి పాలయ్యామని పలువురు పార్టీ అధిష్టానం ముందు ఆవేదన వ్యక్తం చేశారట. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.