Site icon HashtagU Telugu

Bandi Sanjay: బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బిజెపి కి పట్టలేదు: బండి సంజయ్

Bandi Sanjay comments over congress winning in Karnataka

Bandi Sanjay: వేములవాడలో ప్రజాహిత యాత్ర లో బిజేపి జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపీ బండి సంజయ్
కృష్ణా జలాల విషయంలో ప్రజల దృష్టిని మళ్ళించడానికే అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు డ్రామాలాడుతున్నాయని విమర్శించారు బిజేపి జాతీయ ప్రధానకార్యదర్శి ఎంపీ బండి సంజయ్. ఆ రెండు పార్టీలు ఒక్కటేనని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో 400 టీఎంసీల నీటిని ఏపీకి కట్టబెడితే, కేసిఆర్ పాలనలో 812 టీఎంసీల నీటిని సీమకు దోచిపెట్టారని ఆరోపించారు.

1212 టిఎంసీల కృష్ణా జలాలను ఏపికి దోచిపెట్టిన ఆ రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో అసెంబ్లీ లో నీవు గిచ్చినట్టు చేయి…నేను ఏడ్చినట్లు చేస్తానని వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ప్రజాహిత యాత్ర లో భాగంగా వేములవాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న బండి సంజయ్ నూకలమర్రిలో మీడియాతో మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై అసెంబ్లీలో ఎందుకు చర్చించడం లేదని ప్రశ్నించారు. హామీల అంశాన్ని దారి మళ్లించేందుకే కాంగ్రెస్ డ్రామా ఆడుతుందన్నారు. గత సర్కార్ మోసాలు బయట పడకుండా బీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తుందని ఆరోపించారు.

బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తు ఆ రెండు పార్టీల కుట్ర అని ఆరోపించారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాల్సిన ఖర్మ బిజెపి కి పట్టలేదన్నారు. కాంగ్రెస్ బిఆర్ఎస్ కలిసి బిజేపి ని ఎదుర్కునేందుకు సిద్ధమయ్యాయని తెలిపారు. ఎవరెన్ని కుట్రలు చేసిన బిజేపి 400పైగా సీట్లను గెలవబోతుందని స్పష్టం చేశారు. హామీలను విస్మరించిన కాంగ్రెస్ ను కడిగిపారేయాలని కోరారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే డ్రేనేజీలో వేసినట్లేనన్నారు. దేవుడిని నమ్మని వాళ్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు ఓటేయండని కోరారు.