Bandi: స్పీకర్ తీరు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు!

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీరుపై తనదైన శైలిలో స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.

  • Written By:
  • Publish Date - March 16, 2022 / 04:11 PM IST

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీరుపై తనదైన శైలిలో స్పందించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.
భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు సూచనలను, అసెంబ్లీ స్పీకర్‌ తిరస్కరించడాన్ని నిరసిస్తూ ఈనెల 17న బీజేపీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్‌ వద్ద ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’’ చేపట్టనుందని ఆయన తెలిపారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే ఈ ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’లో ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, ఎంపీలు సోయం బాపూరావు, ధర్మపురి అరవింద్ తోపాటు పార్టీ రాష్ట్ర పదాధికారులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ మాజీ ఛైర్మన్లు, మాజీ మున్సిపల్, కార్పొరేషన్ ఛైర్మన్లు, కార్పొరేటర్లు, సీనియర్ నేతలు పాల్గొంటారని బండి సంజయ్ పేర్కొన్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతోందనడానికి, పార్లమెంటరీ సాంప్రదాయాలను తుంగలో తొక్కుతోందనడానికి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షనే నిదర్శనమని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సరిదిద్దుకుని ప్రజాస్వామ్య స్పూర్తిని కాపాడాలంటూ గౌరవ హైకోర్టు ధర్మాసనం సూచించినప్పటికీ పెడచెవిన పెట్టడం అత్యంత హేయమైన చర్యగా బండి సంజయ్ అభివర్ణించారు. రాజ్యాంగ బద్దంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాల్సిన స్పీకర్ టీఆర్ఎస్ కు తొత్తులా మారడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని విమర్శించారు బండి సంజయ్. తెలంగాణలో మంటగలిసిన రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు బీజేపీ తెలంగాణ శాఖ చేపడుతున్న ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’కు ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, విద్యావేత్తలతోపాటు ప్రజా సంఘాల నాయకులంతా తరలివచ్చి మద్దతు తెలిపాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.