Bridge Robbery: భలే దొంగలు.. బిహార్‌లో బ్రిడ్జినే మాయం చేశారు!

బిహార్‌లో దొంగలు మరోసారి తమ పనితనాన్ని చూపించారు.

  • Written By:
  • Updated On - May 4, 2022 / 02:41 PM IST

సాధారణంగా బంగారు ఆభరణాలు, భారీ నగదు, విలువైన వస్తువులు మాత్రమే దొంగతనానికి గురవుతుంటాయి. కానీ బిహార్ లో మాత్రం ఏకంగా బ్రిడ్జిని ఎత్తుకెళ్లి వార్తల్లోకి ఎక్కారు. బిహార్ లోని రోహ్తాస్‌ జిల్లాలో 60 అడుగుల వంతెనను ఎత్తుకెళ్లిన ఘటన జరిగిన నెల రోజుల్లోనే మరో వంతెనను మాయం చేశారు. ఈసారి బాంకా జిల్లా చందన్‌ బ్లాక్‌లో ఈ ఘటన జరిగింది. 80 అడుగుల ఇనుప వంతెనను గ్యాస్‌ కట్టర్ల సాయంతో ముక్కలుగా చేసి ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం 70 శాతం వంతెన మాయమైంది.

ఝాఝా, పటనియా మధ్య ఉన్న వాగుపై 2004లో 80 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో ఈ వంతెన నిర్మించారు. కొత్తగా మరో రెండు వంతెనలు నిర్మించిన క్రమంలో ప్రజలు దీనిని వినియోగించడం లేదు. దీంతో ఈ వంతెనపై దొంగల కళ్లు పడ్డాయి. వంతెన చోరీకి గురైనట్లు తమకు సమాచారం అందలేదని, ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దొంగలు ఇనుమును ఎత్తుకెళ్లారు అనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. భలే దొంగలు.. బ్రిడ్జినే మాయం చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.