Site icon HashtagU Telugu

Bills Gates Covid: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కరోనా పాజిటివ్.. ట్విట్టర్ ద్వారా వెల్లడి

Bill Gates

bill gates

కొవిడ్ మహమ్మారిపై ప్రపంచాన్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసిన మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కు కరోనా సోకింది. ఆయనకు ప్రస్తుతానికి స్వల్ప లక్షణాలు ఉన్నాయి. దీంతో పరీక్షలు చేయించుకోవడంతో కరోనా సోకినట్లుగా వైద్యులు నిర్థారించారు. ఆయన తాను కొవిడ్ పాజిటివ్ అయిన విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ట్విట్టర్ లో ఆయన ఏం చెప్పారంటే.. తనకు కరోనా పాజిటివ్ అని.. ప్రస్తుతానికి స్వల్ప లక్షణాలు ఉన్నాయని అన్నారు. అయితే తన వైద్యుల సలహాలను అనుసరించి.. మళ్లీ పూర్తిగా ఆరోగ్యవంతుడిని అయ్యేవరకు ఐసోలేషన్ లో ఉంటనన్నారు. బిల్ గేట్స్ ఇప్పటికే రెండు కొవిడ్ టీకాలు తీసుకున్నారు. వీటితోపాటు బూస్టర్ డోసు కూడా వేసుకున్నారు. అయినా సరే కొవిడ్ నుంచి తప్పించుకోలేకపోయారు.

అత్యుత్తమ వైద్య సేవలు పొందే అదృష్టం బిల్ గేట్స్ కు ఉంది. ఆయన కూడా అది తన లక్ అని ట్విట్టర్ లో తెలిపారు. ఇక కరోనా టీకాలు ప్రపంచంలో అందరికీ ఉండాలని ఆయన కోరుకున్నారు. ధనిక దేశాలు వీటిని తయారుచేసుకోవడమో, కొనుగోలు చేయడమో చేయగలవు. కానీ పేద దేశాలకు అలాంటి సదుపాయం ఉండదు. కొవిడ్ టీకాలపై భారీగా ఖర్చు చేసే పరిస్థితి వాటికి ఉండదు. ఆయన ఆవేదన కూడా ఇదే.

బిల్ గేట్స్ తన గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే ఆరోగ్య రంగానికి భారీగా విరాళాలు సమకూర్చారు. అనేక పరిశోధనల కోసం అంతే భారీగా నిధులను అందిస్తున్నారు. ఇప్పుడు కరోనా మహమ్మారిపైనా పోరాటానికి నడుం బిగించారు. ఈ తరుణంలో ఆయన కొవిడ్ బారిన పడ్డారు. ఆయన త్వరగా కోలుకోవాలని మైక్రోసాఫ్ట్ ఉద్యోగులతోపాటు ఆయన అభిమానులంతా కోరుకుంటున్నారు.