Team India: భారత్ కు మరో బిగ్ షాక్

శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి.ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు.

  • Written By:
  • Publish Date - February 23, 2022 / 11:24 AM IST

శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాను గాయాలు వెంటాడుతున్నాయి.ఇప్పటికే ఫాస్ట్ బౌలర్ దీపక్ చాహర్ గాయం కారణంగా సిరీస్‌కు దూరమయ్యాడు. తాజాగా మరో ఆటగాడు సూర్యకుమార్ యాదవ్‌ శ్రీలంక సిరీస్‌ నుండి తప్పుకున్నాడు. తొలి టీ ట్వంటీ కోసం ప్రాక్టీస్ చేస్తుండగా సూర్య కుమార్ గాయపడ్డాడు. దీంతో అతన్ని జట్టు ఫిజియో బయటకు తీసుకెళ్ళాడు. ప్రస్తుతం అతని గాయాన్ని బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తుంది. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియా క్లీన్ స్వీప్ చేయడంలో సూర్య కుమార్ కీలక పాత్ర పోషించాడు.

ఏడాది చివర్లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు సన్నద్ధమవుతున్న భారత జట్టుకు ప్రస్తుతం ప్రతి టీ20 సిరీస్‌ ఎంతో కీలకం. ప్రతి సిరీస్‌లో చేస్తున్న ప్రయోగాలతో పాటు కీలకమైన ఈ టోర్నీకి జట్టు కూర్పుపై ఒక నిర్ణయానికి రావాలని టీమ్ మేనేజ్ మెంట్ భావిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆటగాళ్ళ గాయాలు కలవరపెడుతున్నాయి. విండీస్ తో సీరీస్ జరుగుతుండగా ..కే ఎల్ రాహుల్, అక్షర్ పటేల్ , అశ్విన్ , గాయాలతో దూరమయ్యారు. ఇప్పుడు దీపక్ చాహర్ తో పాటు సూర్య కుమార్ కూడా గాయపడ్డడం ద్రావిడ్ , రోహిత్ లకు టెన్షన్ పెడుతోంది. మరోవైపు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కూడా ఆటగాళ్ళ గాయాల పై ఉలిక్కి పడుతున్నాయి.

15వ సీజన్ కు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉండగా అప్పటికి వీరంతా కోలుకోవాలని ఎదురు చూస్తున్నాయి. సీరీస్ లో ఆడకున్నా ప్రస్తుతం సూర్యకుమార్ జట్టుతో కలిసి ఉంటాడని బోర్డు వర్గాలు తెలిపాయి. కాగా భారత్ , శ్రీలంక మధ్య ఫిబ్రవరి 24 నుంచి మూడు టీ20ల సిరీస్ ప్రారంభం కానుంది. సిరీస్‌లో మొదటి మ్యాచ్ లక్నోలో జరగనుండగా, మిగిలిన రెండు మ్యాచ్‌లు ధర్మశాలలో జరగనున్నాయి. ఆ తర్వాత మార్చ్ 4 నుండి రెండు టెస్టుల సిరీస్ ఆరంభం కానుంది.