Defamation Case : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్‌పై దాఖలైన పరువు నష్టం కేసులో ఆయనపై జరిగిన క్రిమినల్ విచారణను సుప్రీం కోర్టు ఈ రోజు (జనవరి 20) నిలిపివేసింది. అంతేకాక..భారతీయ జనతా పార్టీ కార్యకర్త నవీన్ ఝా దాఖలు చేసిన పరువు నష్టం కేసును కూడా సుప్రీం కోర్టు కొట్టివేసింది.
కాగా, బెంగళూరులో 2018 లో జరిగిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పై రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అమిత్ షా ఓ హత్య కేసులో నిందితుడని రాహుల్ ఆరోపించారు. ఆ ఘటనలో రాహుల్‌పై క్రమినల్ డిఫమేషన్ కేసు బుక్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్త నవీన్ ఝా పరువునష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న రాహుల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీంతో రాహుల్.. జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి జార్ఖండ్ కోర్టు నిరాకరించింది. దీంతో రాహుల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇదే సమయంలో, జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ రాహుల్ గాంధీ దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి పిటిషన్‌ను సుప్రీం కోర్టు న్యాయమూర్తులు విక్రమ్ నాథ్,సందీప్ మెహతా ధర్మాసనం పరిశీలించింది. రాహుల్ తరఫున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ కోర్టుకు వాదిస్తూ, క్రిమినల్ పరువు నష్టం ఫిర్యాదును బాధితుడు మాత్రమే దాఖలు చేయగలరని, మూడవ పార్టీ ద్వారా ఫిర్యాదు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. ఇది వరకు కూడా అనేక తీర్పుల్లో న్యాయస్థానాలు ఈ అంశాన్ని స్పష్టం చేశాయని ఆయన పేర్కొన్నారు. అభిషేక్ సింఘ్వీ వాదనలపై స్పందించడానికి బీజేపీ కార్యకర్త, ఫిర్యాదుదారు నవీన్ ఝా, జార్ఖండ్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు నాలుగు వారాల సమయాన్ని ఇచ్చింది.