Site icon HashtagU Telugu

Team India: టీమిండియాకు షాక్.. ఇద్దరికి గాయాలు

Chahar Iyer

Chahar Iyer

విండీస్ పై టీ ట్వంటీ సీరీస్ లోనూ శుభారంభం చేసి జోరుమీదున్న టీమిండియాకు రెండో టీ20 ముంగిట ఊహించని షాక్ తగిలింది. యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ , స్టార్ పేసర్ దీపక్ చాహర్ రెండో మ్యాచ్ ఆడటంపై అనుమానం నెలకొంది. తొలి టీ20 మ్యాచ్ లో విండీస్ సారథి కిరన్ పోలార్డ్ కొట్టిన బంతులని ఆపే క్రమంలో దీపక్ చాహర్, వెంకటేశ్ అయ్యర్ గాయాలపాలయ్యారు.తొలుత 17వ ఓవర్లో ఫీల్డింగ్‌ చేస్తూ వెంకటేశ్‌ అయ్యర్‌ గాయపడ్డాడు. కీరన్ పొలార్డ్ బలంగా హిట్ చేసిన బంతిని బౌండరీ లైన్ వద్ద నిలువరించే క్రమంలో అయ్యర్ గాయపడ్డాడు. అతని చేతికి గట్టిగా తాకిన బంతి.. బౌండరీ‌కి వెళ్లిపోయింది.

గాయపడిన తర్వాత మైదానం వీడిన వెంకటేశ్‌ అయ్యర్‌.. మళ్లీ ఫీల్డ్ లోకి అడుగుపెట్టలేదు… ఆ తరువాత పొలార్డ్‌ స్క్వేర్‌ లెగ్‌లోకి బలంగా కొట్టిన బంతిని ఆపే ప్రయత్నంలో దీపక్ చాహర్ కు గాయమైంది. విండీస్‌ ఇన్నింగ్స్‌ 19వ ఓవర్లో ఇది జరిగింది. దాంతో దీపక్ చాహర్‌ కూడా వెంటనే మైదానాన్ని వీడాడు. అయితే.. వీరిద్దరి గాయం తీవ్రతపై మాత్రం ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు.. ప్రస్తుతం వీరిద్దరికీ బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. మరి రెండో టీ20 మ్యాచ్ కు వీరు అందుబాటులో ఉంటారో లేదో చూడాలి. ఒకవేళ వీరిద్దరూ రెండో టీ20కి దూరమైతే.. దీపక్ చాహర్ స్థానంలో శార్ధూల్ ఠాకూర్, వెంకటేష్ అయ్యర్ స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.

Exit mobile version