Site icon HashtagU Telugu

Bheemla Nayak: రికార్డుల ‘భీమ్లా నాయక్’… ఓటీటీ డీల్ ఎన్ని కోట్లో తెలుసా?

Bheemla

Bheemla

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నటించిన తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ మూవీకి… సాగర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా… పవన్ బెస్ట్ ఫ్రెండ్, మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన `అయ్యప్పనుమ్‌ కోషియుమ్`కు రీమేక్‌గా తెరకెక్కిన ‘భీమ్లా నాయక్’ లో పవన్ కు ప్రత్యర్థి పాత్రలో రానా దగ్గుబాటి నటించారు. పవన్ కు జోడీగా నిత్య మీన‌న్‌, రానా సరసన సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు.

సంగీత దర్శకుడిగా థమన్ పనిచేశారు. ఇప్పటికే థమన్ అందించిన స్వరాలు హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా షూటింగ్ పూర్తి చేసుకున్న ‘భీమ్లా నాయక్’ ను ఫిబ్ర‌వ‌రి 25న గ్రాండ్‌గా తెలుగుతో పాటు, హిందీలోనూ విడుద‌ల చేయ‌బోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయింది. మేకర్స్ కూడా మరింత జోరుగా ప్రమోషన్ చేస్తున్నారు.

ఇక‌పోతే, ‘భీమ్లా నాయక్’ కు సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ మధ్య విడుదలవుతున్న సినిమాలన్నీ కూడా థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ‘భీమ్లా నాయక్’ చిత్రం కూడా విడుదలకు ముందే… ఓటీటీ డీల్ కుదుర్చుకుంది. పవన్ సినిమా కోసం చాలా ఓటీటీ సంస్థలు పోటీ ప‌డ్డాయ‌ట‌. అయితే చివ‌ర‌కు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ ఈ సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను రికార్డ్ స్థాయిలో చెల్లించి సొంతం చేసుకుంద‌ని టాక్. అందుకుగానూ, హాట్ స్టార్ ఏకంగా రూ. 75 కోట్ల‌ను చెల్లించింద‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఇక‌ థియేట‌ర్స్‌లో విడుద‌లైన నాలుగు వారాల త‌ర్వాత ‘భీమ్లా నాయ‌క్’ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంద‌ని సమాచారం. ఏదేమైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా అంటే ఏంటో మరోసారి ప్రూవ్ అయిందని చర్చించుకుంటున్నారు. ఎందుకంటే… ఓ రీమేక్ సినిమాకి ఈ స్థాయిలో డీల్ కుదరడం అంటే మామూలు విషయం కాదు. అందుకే అంటారు పవన్ కళ్యాణ్ అంటేనే ఓ ప్రభంజనం అని. అదీ మరి పవర్ స్టార్ స్టామినా అంటే.