ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో జంటలను వేధిస్తున్నారనే ఆరోపణలపై ఆగ్రా పోలీసులు సోమవారం కొంతమంది భజరంగ్ దళ్ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. బజరంగ్ దళ్ సభ్యులు నగరంలో బాలబాలికలను వేధించినట్లు వెలుగులోకి రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఆగ్రా డీఐజీ-ఎస్ఎస్పీ సుధీర్ కుమార్ సింగ్ తెలిపారు. హరిపర్వత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలివాల్ పార్క్‌లో కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు కూర్చున్నారు. కొందరు భజరంగ్ దళ్ కార్యకర్తలు అక్కడికి చేరుకుని వారితో దురుసుగా ప్రవర్తించారని..దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
అంతకుముందు రోజు మహిళలతో సహా మితవాద సంస్థ కార్యకర్తలు పార్కుకు చేరుకున్నారు, అక్కడ వారు వాలెంటైన్స్ డే వేడుకలకు వ్యతిరేకంగా యువకులను, బాలికలను చుట్టుముట్టారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఒక మహిళా కార్యకర్త తన మెడలో కాషాయ కండువా ధరించి పాఠశాల యూనిఫాంలో ఉన్న బాలికను పట్టుకుని ఆమె గుర్తింపు కార్డును తనిఖీ చేసి, ఆమె తల్లిదండ్రులను పిలవమని కోరినట్లు వీడియో ఉంది.