Sourav Ganguly: గంగూలీ రాజీనామాకు రీజన్ ఇదే!

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూటే వేరు. బ్యాటింగ్ ఎలా చేయాలో దాదాకు బాగా తెలుసు. అందుకే సరదాగా ఓ ట్వీట్ చేశాడు.

  • Written By:
  • Updated On - June 2, 2022 / 03:37 PM IST

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ రూటే వేరు. బ్యాటింగ్ ఎలా చేయాలో దాదాకు బాగా తెలుసు. అందుకే సరదాగా ఓ ట్వీట్ చేశాడు. తాను క్రికెట్ లోకి వచ్చి 30 ఏళ్లయిన సందర్భంగా.. తన ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ రాసుకొచ్చాడు. ఓ కొత్త అధ్యాయం మొదలుపెట్టబోతున్నట్టు కూడా చెప్పాడు. దీంతో ఆయన బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వస్తారని అంతా ఊహించారు. కానీ ఇప్పుడేమో అదేం లేదు.. రాజకీయాల్లోకి వస్తానని తానేం చెప్పలేదన్నాడు.

బెంగాల్ దాదా ట్వీట్ చేసింది రాజకీయాల్లోకి రావడానికి కాదట. విద్యకు సంబంధించి ఓ అంతర్జాతీయ యాప్ ను తీసుకువచ్చే పనిలో ఉన్నాడట. అందుకే దాని గురించి హింట్ ఇచ్చేలా తాను ట్వీట్ చేశానని వివరణ ఇచ్చాడు. నిజంగా యాప్ కోసమే అయితే ఆ యాప్ పేరునో.. లేదా అది దేనికి సంబంధించిన యాప్ అనో.. అదీ కాదంటే.. వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నాను అనో చెబితే సరిపోయేదు. కానీ నర్మగర్భంగా ట్వీ్ట్ చేయడంతో జాతీయస్థాయిలో దానిపై చర్చ జరిగింది.

గంగూలీ ఈమధ్య వేస్తున్న అడుగులు కూడా ఆయన రాజకీయ ప్రవేశాన్ని నిర్దారిస్తున్నాయి. ఎందుకంటే ఈమధ్య అమిత్ షా.. గంగూలీని కలిశారు. దాదా ఇంటికి వెళ్లి మరీ భోజనం చేశారు. అప్పుడే గంగూలీ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నాడని.. ఇక బీసీసీఐ కి రాజీనామా చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. బెంగాల్ లో మమతకు పోటీగా ఉండాలంటే అంతటి ప్రజాకర్షణ ఉన్న నేత అవసరం. అందుకే గంగూలీకి వల వేశారని భావించారు. పైగా గంగూలీ కూడా అమిత్ షాను కలిశారు. దీంతో ఆయన రాజకీయరంగ ప్రవేశంపై చాలామందికి క్లారిటీ వచ్చింది. కానీ ఇప్పుడు దాదా ఇచ్చిన వివరణతో .. ఇప్పట్లో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉండకపోవచ్చని అంటున్నారు.