క్రికెట్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 15వ సీజన్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మొత్తం మహారాష్ట్రలోనే జరగనున్నాయి. ముంబై, పుణే వేదికగా ఈ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ త్వరలోనే విడుదల చేయనుంది. అయితే ఈసారి ఐపీఎల్ లో పాల్గొనబోయే అన్ని జట్లకు బీసీసీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మార్చి 8 నుంచి టోర్నీలోని 10 జట్లు ముంబైలోకి అడుగుపెట్టొచ్చని తెలిపింది. అయితే స్వదేశంలో ఉన్నవారైతే 3 రోజులు, విదేశాల నుంచి వచ్చేవారు 5 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని తెలిపింది.
అలాగే ఐపీఎల్ కోసం ముంబయికి వచ్చే ఆటగాళ్లు అందరూ 48 గంటల ముందు కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించింది. ఐపీఎల్ జట్ల కోసం ముంబయిలో 10 హోటల్స్‌ని, పూణేలో2 హోటల్స్ బీసీసీఐ కేటాయించినట్లు తెలిపింది..ఇక ఐపీఎల్ 15వ సీజన్ ప్రాక్టీస్ కోసం జట్లకు 5 మైదానాలను కూడా కేటాయించినట్లు బీసీసీఐ ప్రకటించింది. దాంతో మార్చి 14 వ తేదీ నుంచి అంటే ఐపీఎల్ ఆరంబానికి 11 రోజుల ముందే అన్ని జట్లు ప్రాక్టీస్ సెషన్స్ నిర్వహించుకోవచ్చని వెల్లడించింది.
టోర్నీకి సంబంధించి ముంబైలో 55 మ్యాచ్‌లు జరగనుండగా.. ప్లే ఆఫ్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఐపీఎల్ 2022 లీగ్ దశలో ముంబైలో 55, పూణేలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్‌లోని అన్ని మ్యాచ్‌లు నాలుగు స్టేడియంలలోనే జరగనున్నాయి. వాంఖడే స్టేడియం, డివై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచ్‌లు, బ్రబౌర్న్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు, పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో 15 మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే ప్లే ఆఫ్ మ్యాచ్‌ల వేదికలను బీసీసీఐ తర్వాత ప్రకటించనుంది.