Basara IIIT Students: బాసర విద్యార్థులతో ‘కేసీఆర్’ గేమ్స్!

బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు.

  • Written By:
  • Updated On - June 20, 2022 / 02:43 PM IST

బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థుల ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులను.. విరమింపజేసేందుకు.. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉన్నతాధికారులు వచ్చినా.. వెనక్కు తగ్గట్లేదు. సీఎం కేసీఆర్ లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు.. ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు. బాసర విద్యార్థుల ఉద్యమానికి ప్రతిపక్షాల మద్దతు మాత్రమే కాకుండా.. యావత్తు తెలంగాణ నుంచి స్పందన వస్తోంది. ప్రతిఒక్కరినీ కదిలిస్తోంది. తమ ఆందోళనలో భాగంగా బాసర విద్యార్థులు సీఎం కేసీఆర్ కు సోమవారం బహిరంగ లేఖ రాశారు.

కేసీఆర్ కు బహిరంగ లేఖ

‘‘గ్రామీణ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించేందుకు ఏర్పాటు చేసిన బాసర ఐఐఐటీలో నెలకొన్న సమస్యలపై విద్యార్ధులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తూ జైలు లాంటి జీవితం గడుపుతున్నారు. కనీసం వారి తల్లిదండ్రులను కూడా కలవనీయడం లేదు. సమస్యలను పరిష్కారించాలని విద్యార్ధులు కోరుతుంటే..కరెంట్ నిలిపి వేసి, మంచి నీళ్లు బంద్ చేసి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. ఇటువంటి చర్యలన్నీ ముమ్మాటికి మానవ హక్కలు ఉల్లంఘన కిందకే వస్తాయి. బాసర ఐఐఐటీలో నెలకొన్న సమస్యలను తెలుసుకోవడానికి మీరు వెళ్లరు. మా లాంటి వారు వెళ్లి సమస్యలను తెలుసుకొని ప్రభుత్వం దృష్టి తీసుకురావాలనుకుంటే హైదరాబాద్ నుంచి బాసర వరకు అణువణునా పోలీసులను మొహరించి అరెస్టులకు పాల్పడుతున్నారు. ఇటువంటి నిర్భంద పరిస్థితుల్లో విద్యార్ధులు ఎండకు ఎండుతూ వానకు తడస్తూ అంకుఠిత దీక్షతో తమ ఆందోళనను కొనసాగిస్తుంటే వాళ్ల సమస్యలు సిల్లీ అంటూ విద్యా శాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘మరో వైపు మీ పుత్ర రత్నం మంత్రి కేటీఆర్.. అన్ని సమస్యలను పరిష్కరిస్తామని జూన్ 15న ట్వీట్ చేశారు. ఇది చెప్పి కూడా 5 రోజులు అయింది. ఎటువంటి అతీగతీ లేదు.  లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం లక్షల ఉద్యోగాలు ఇచ్చాం అని సూటు బూటు వేసుకొని పారిశ్రామికవేత్తలతో ఫోటోలు దిగుతుంటాడు. గత ఎనిమిదేళ్లుగా తెలంగాణలో ఒక ఉన్నత విద్యా సంస్థ రాకుండా..విద్యార్థులకు ఉన్నత విద్య అందని పరిస్థితిల్లో మీరు చెబుతున్న లక్షల ఉద్యోగాలకు అవసరమైన అర్హత ఎక్కడ నుంచి విద్యార్ధులకు లభిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఆ లక్షల ఉద్యోగాలకు ఎవరికి దక్కాయి? మీ ప్రభుత్వ నిర్వాకం మూలంగా ప్రతిష్టాత్మకమైన బాసర ఐఐఐటీ న్యాక్ దృష్టిలో సి గ్రేడ్ ర్యాంకుకు పడిపోయింది. న్యాక్ గ్రేడ్‌ ఆధారంగానే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లలో మల్టీ నేషనల్‌ కంపెనీలు పాల్గొనడంతోపాటు యూజీసీ నుంచి పరిశోధనలకు నిధులు వస్తాయి. మీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పుడు ఇవన్నీ నిలిచి పోయే ప్రమాదం ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ యువతకు లక్షల ఉద్యోగాలు ఏటు నుంచి వస్తాయి’’ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

‘‘దాదాపు 8 వేల విద్యార్థులు అందోళన చేస్తుంటే భోజనం పెట్టమని హెచ్ఓడీలు బెదిరింపులకు పాల్పపడుతున్నారు. మరో వైపు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చర్చలు సఫలం సోమవారం నుంచి విద్యార్ధులు తరగతులకు హాజరవుతారని సమస్యను పక్క దారి పట్టించే ప్రయత్నం చేశారు. విద్యార్ధులు ఆగ్రహించడంతో ఆ ప్రకటనను వెనక్కితీసుకున్నారు. సోమవారం వచ్చింది విద్యార్ధుల ఆందోళనలు అలాగే కొనసాగుతున్నాయి. మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి, కలెక్టర్ చర్చలు జరుపుతున్నా విద్యార్ధులు నమ్మడం లేదు. రాత పూర్వక హామీ కావాలని పట్టుబడుతున్నారు. ఇంత జరుగుతుంటే వేగంగా స్పదించాల్సిన మీరు అసలు రాష్ట్రంలో ఉన్నారో లేదో తెలియదు. అసలు సమస్య గురించి మీకు తెలుసో లేదో కూడా తెలియదు. విద్యార్థులను ఆందోళన విరమించడానికి ఇప్పటి వరకు సామ దాన భేద దండోపాయాలను ప్రయోగించారు. అయినా విద్యార్ధులు వెనక్కి తగ్గిలేదు. ఇక చివరగా దీర్ఘకాలిక సెలవులు ప్రకటించడమే పరిష్కారంగా భావిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే అంత కంటే సిగ్గుమాలిన చర్య మరొకటి ఉండదు’’

మీ రాజకీయ పార్టీని విస్తరించుకోవడానికి బీఆర్ఎప్ పేరిట గంటల తరబడి ఏసీ రూముల్లో చర్చించుకోవడానికి, తెలంగాణను వ్యతిరేకించిన శక్తులతో సమావేశానికి సమయం ఉంటుంది. తిరిగి అధికారంలోకి రావడానికి చేయాల్సిన కుట్రలు కుతంత్రాలపై పీకే వంటి వారితో చర్చించడానికి, ప్రత్యర్ధులను అణదొగ్గడానికి అనుసరించాల్సిన వ్యూహాలకు సమయం లభిస్తుంది. కానీ బాసర ఐఐఐటీ విద్యార్ధులు వారం రోజులుగా ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆందోళనలు చేస్తుంటే ఆ సమస్యల పరిష్కారం కోసం 5 నిమిషాల సమయం కేటాయించే తీరిక కూడా దొరకడం లేదా?.. ఇటీవలి కాలంలో తమ మనోభావాలు దెబ్బతింటే సంబంధిత సమూహాలు ఎంతంటి చర్యలకైనా దిగడానికి వెనుకాడని సంఘటనలను చూస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో బాసర విద్యార్ధుల సమస్యను పరిష్కరించకుంటే మీరు రాష్ట్రంలో తిరగని పరిస్థితులు దాపురిస్తాయి. ఈ నేపథ్యంలో విద్యార్ధులు కోరుకున్న డిమాండ్లను సత్వరమే పరిష్కరించాలి’’ అని డిమాండ్ చేశారు.

విద్యార్ధుల డిమాండ్లు

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ వర్సిటీని సందర్శించాలి.

రెగ్యులర్‌ వీసీని నియమించాలి. ఆయన క్యాం పస్‌లోనే ఉండాలి.

విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అధ్యాపకుల సంఖ్యను పెంచాలి.

ఇన్ఫర్మేషన్, టెక్నాలజీ ఆధారిత విద్యను అందించాలి.

ఇతర వర్సిటీలు, సంస్థలతో వర్సిటీని అనుసంధానం చేయాలి.

తరగతి, హాస్టల్‌ గదులకు మరమ్మతులు చేయాలి.

ల్యాప్‌టాప్‌లు, యూనిఫామ్, మంచాలు, బెడ్లు అందించాలి.

మెస్‌ల మెయింటెనెన్స్‌ మెరుగ్గా ఉండేలా చూడాలి.

పీడీ, పీఈటీలను నియమించి క్రీడలనూ ప్రోత్సహించాలి.

సమస్యలు పరిష్కరించాల్సిందే

బాసర ఉద్యమం పెద్ద ఎత్తున కొనసాగుతుండటంతో హ్యష్ ట్యాగ్ యూ (Hashtag U) ‘స్టూడెంట్స్ గవర్న్ మెంట్ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి సాయిచరణ్‘ ముచ్చటించింది. ఈ సందర్భంగా సాయిచరణ్ తమ సమస్యలను విన్నవించుకున్నారు. 2008 విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థులకు అన్ని వసతులు సమకూర్చాలి. కానీ ఆ చట్టం ప్రకారం ఏదీ జరగడం లేదు. రాజకీయాలతో మాకు సంబంధం లేదు. వాళ్లతో సంబంధం లేకుండా ఉద్యమం చేస్తున్నాం. కానీ ఇతర పార్టీలు మద్దతు ఇస్తునందుకు ఆనందంగా ఉంది. తెలంగాణ మొత్తం మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం. సుమారు 7 వేలమంది విద్యార్థులకు సంబంధించిన ఇష్యూ ఇది. కేసీఆర్, కేటీఆర్ వెంటనే జోక్యం చేసుకొని సమస్యలను పరిష్కరించాలి.