Bandi Sanjay: బతుకమ్మ చీరల బకాయిలు ₹270 కోట్లు చెల్లించాలి: బండి సంజయ్

  • Written By:
  • Publish Date - April 6, 2024 / 11:53 PM IST

ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేక, ఇటు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకోవడం తనను కలిచివేసిందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం సాయంత్రం సిరిసిల్లలో వారి భౌతికదేహానికి నివాళులర్పించి,  లక్ష్మీనారాయణ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ తర్వాత లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్న తన కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని బండి హామీ ఇచ్చారు.

మొన్నటి వరకు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతన్నలను పట్టించుకోలేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, బతుకమ్మ చీరల బకాయిలు ₹270 కోట్లు చెల్లించలేదని బండి మండిపడ్డారు. కొత్త ఆర్డర్లు ఇవ్వక వస్త్రపరిశ్రమలు మూతపడి, ఆదుకోవాలని నేతన్నలు భిక్షాటన చేసినా కూడా ప్రభుత్వం స్పందించడం లేదని బండి ఆవేదన వ్యక్తం చేశారు.

తక్షణమే లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఆదుకొని, నష్టపరిహారం అందించి నేతన్నలో భరోసా నింపేలా చర్యలు తీసుకోవాలని బండి డిమాండ్ చేశారు. నేతన్నల సమస్యల మీద ముఖ్యమంత్రికి గతంలో లేఖ రాయగా, ఇప్పటివరకు స్పందన లేదని బండి చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టేందుకు, నేతన్నలకు భరోసా నింపి, అండగా ఉండేందుకు ఈనెల 10న సిరిసిల్లలో దీక్ష చేయాలని నిర్ణయించామని,  రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు దీక్షకు సంఘీభావం తెలిపి విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.