తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోమారు బండి సంజయ్ విరుచుకుపడ్డారు. ఈసారి అందుకు ఆసరా పెన్షన్ల అంశాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రంలో 57 సంవత్సరాలు దాటిన అర్హులందరికీ ఆసరా పథకం క్రింద పించన్లు ఇస్తామని అనేకసార్లు కేసీఆర్ స్వయంగా ప్రకటించారని… 2018 ఎన్నికల మ్యానిఫెస్టోలో పేజీ నెం.12, పాయింట్ నెం.2 లో ఆసరాపించన్ల వయోపరిమితిని 65 నుండి` 57 సంవత్సరాలకు తగ్గించనున్నట్లు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రభుత్వ ప్రకటనతో అర్హులైన దాదాపు 11 లక్షల మంది కొత్త ఆసరా పించన్ల కోసం ఏళ్ళతరబడి నిరీక్షిస్తున్నారు.
ఏప్రిల్ 1 నుండి కొత్త పించన్లు ఇస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేసిన ప్రభుత్వం… అందుకు తగ్గ కసరత్తు ప్రారంభించకపోవడం శోచనీయం. కొత్త పించన్ల ధరఖాస్తుల స్వీకరణకు అవసరమైన మార్గదర్శకాలను సైతం విడుదల చేయకపోవడంతో ఆసరా పించన్లపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తేటతెల్లం చేస్తోంది.
రాష్ట్రంలో సుమారు 39 లక్షల మంది ఆసరా పించనుదారులు ఉండగా… దాదాపు కొత్త పించన్ల కోసం 11 లక్షల ధరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. తమకు వెంటనే పించను అందించి ఆదుకోవాలని ధరఖాస్తుదారులంతా ఏళ్ళతరబడి అధికారపార్టీ నాయకులు, అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆసరా పథకం అంటేనే ఆర్థికంగా చితికిపోయిన పేదలకు ఉద్దేశించింది. కుటుంబంలో ఆసరా పథకం పించను పొందే వ్యక్తి మరణిస్తే, ఆ కుటుంబంలో అర్హులుంటే… ఆ పించను కొనసాగించాలి. అలా కాకుండా ఒక కుటుంబానికి ఒకే పించను అని నిర్ణయించడం అన్యాయం. ఇది ముమ్మాటికీ వృద్ధాప్యంలో ఉన్న పేదవారి ఉసురుగొట్టుకొనే చర్యే. పభుత్వ ఈ అనాలోచిత చర్యవల్ల రెండు లక్షల మందికిపైగా ఆసరా పించనుకు దూరమయ్యారు.
2018 డిసెంబర్‌లో ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలు కాకపోవటంతో…బీగడిచిన 39 నెలల్లో ఒక్కో ఆసరా పించను లబ్ధిదారులకి ప్రభుత్వం రూ.78,624 లు బకాయి పడింది. ఈ బకాయిపడ్డ సొమ్మును వృద్ధులకు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ తెలంగాణశాఖ డిమాండ్ చేస్తోందని అన్నారు బండి సంజయ్. ఆసరా పథకం అందుకుంటున్న వ్యక్తి మృతి చెందితే ఆ కుటుంబంలో అర్హులుంటే పించను కొనసాగించడం, లేకపోతే మరొక అర్హులైన వారికి పించను ఇవ్వడం నిరంతర ప్రక్రియగా జరగాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. వయోపరిమితి సడలింపు వలన కొత్త లబ్ధిదారుల సంఖ్య పెరగనున్నందున దానికి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు చేయాలని, ఆసరా పించన్ల కొత్త ధరఖాస్తుల పరిశీలనకు అవసరమైన మార్గదర్శకాలు వెంటనే విడుదల చేసి అర్హులైన వారందరికీ ఆసరా పించన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోందన్నారు
బండి సంజయ్.