Bandi Sanjay: కేసీఆర్.. వలసలకు సాక్ష్యమిదిగో!

వలసలు పూర్తిగా ఆగిపోయాయంటూ కేసీఆర్ వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని బండి సంజయ్ కుమార్ అన్నారు.

  • Written By:
  • Updated On - April 29, 2022 / 03:15 PM IST

పాలమూరు పచ్చబడ్డదని, వలసలు పూర్తిగా ఆగిపోయాయంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు పచ్చి అబద్దాలని తేలిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. పాలమూరులో వలసలు ఆగలేదని… నిత్యం ముంబైకి వందలాది మంది వలస వెళుతున్నారనడానికి ఈ బస్సే నిదర్శనమని చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 16వ రోజు నారాయణపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర లంచ్ శిబిరం వద్దకు రాగానే అక్కడి నుండి ముంబై వెళుతున్న బస్సును బండి సంజయ్ గమనించారు. ఆ బస్సెక్కి అందులోని ప్రయాణీకులను ఎక్కడికి వెళుతున్నారంటూ ఆరా తీశారు. వారంతా తాము ఉపాధి కోసం ముంబై వెళుతున్నామని జవాబిచ్చారు. అందులో చిన్ని పిల్లలు, చంటిపాప తల్లులు కూడా ఉండటం గమనార్హం. ఉన్న ఊరిని వదిలి వెళ్లాలని లేకపోయినప్పటికీ బతికే దారిలేక వలస వెళుతున్నామని వారు వాపోయారు. ఈ సందర్భంగా బండి సంజయ్ బస్ డ్రైవర్ ను ముంబయికి ఎన్ని బస్సులు వెళతాయని ఆరా తీశారు. ఆర్టీసీ బస్సుతోపాటు రోజూ నారాయణపేట పలు ప్రైవేట్ బస్సులు కూడా ముంబయికి వెళతాయని.. అందులో రోజుకు వందలాది మంది వలస వెళతున్నారని పేర్కొన్నారు.

ఆర్టీసీ బస్సులో సీట్లు లేకపోయినా కింద కూర్చుని వెళుతున్న దృశ్యాలను కూడా బండి సంజయ్ గుర్తించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ…. ‘‘పాలమూరులో వలసలు బంద్ అయ్యాయని, పాలమూరు పచ్చగా ఉందని చెబుతున్న కేసీఆర్….ఇదిగో చూడండి.. నారాయణపేట నుండి ముంబయి వయా గుల్బార్గా మీదుగా రోజూ ఈ బస్ (టీఎస్ 06టీ 0218 నెంబర్) ముంబై వెళతది. … బస్ నిండా జనాలే. ఒక్కో బస్ లో 50 మంది ప్రయాణీకులున్నారు. ఇదొక్కటే కాదు… రోజు ఇక్కడి నుండి ఆర్టీసీతోపాటు ప్రైవేట్ బస్సులు కూడా ముంబై వెళతాయి.’’ అని పేర్కొన్నారు. ‘‘ కేసీఆర్.. నీ మూర్ఖత్వపు, దౌర్భాగ్యపు, కుటుంబ, అవినీతి, నీచమైన పాలనలో పాలమూరు ప్రజల దుస్థితి ఇది. పిల్లా పెద్దా తేడా లేకుండా చంటి పిల్లలను కూడా ఎత్తుకుని మూట ముల్లె సర్దుకుని ప్రతి రోజూ వందల మంది కూలీ నాలీ కోసం వలసలు పోతున్నారంటే… నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి.’’అని ధ్వజమెత్తారు. మళ్లీ పచ్చి అబద్దాలు చెబుతావ్.. .కొడుకో అబద్దం, అల్లుడు, కూతురు సహా కుటుంబమంతా అబద్దాలతోనే బతుకుతున్నారు.

తెలంగాణలో బతకడానికి దారిలేక పిల్లలను ఇక్కడే వృద్ధుల వద్ద వదిలిపెట్టి ముంబై వెళుతున్నారు. సెలవులొచ్చినయని ఈరోజు చిన్న చిన్న పిల్లలు సైతం పనిచేసుకోవడానికి ఈ బస్సులోనే ముంబై వెళుతున్నారు. అమ్మానాన్నలకు తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. కేసీఆర్… కోట్లు దండుకుని నువ్వు, నీ కొడుకు, మనువడు మాత్రం జల్సాలు చేసుకుంటూ బతుకుతున్నారు. కానీ వీళ్లు మాత్రం పొట్ట చేతబట్టుకుని కడుపు నింపుకోవడానికి ముంబై వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్ కార్యకర్తలకు, రాష్ట్ర ప్రజలకు నిజం చూపడానికే ఈరోజు వాస్తవ విషయాలు మీకు తెలియజేస్తున్నం’’అని వివరించారు. పాలమూరు పచ్చబడాలన్నా… వలసలు ఆగాలన్నా పాలకుల్లో దృఢ సంకల్పం ఉండాలని, మానవత్వం ఉండాలని అన్నారు. కానీ సీఎం కేసీఆర్ మానవత్వం లేని మృగం అని పేర్కొన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగు, తాగు నీరు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు. అందులో భాగంగా 69 జీవోను అమలు చేసి నారాయణపేట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామన్నారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.