రాష్ట్ర ప్రభుత్వ తప్పిదం వల్ల ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఫెయిల్ అయ్యారని, దీంతో వారంతా ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అన్నారు. సమాధాన పత్రాల రీవాల్యుయేషన్‌ను ఉచితంగా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని.. విపరీతమైన చర్యలకు దిగి విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. మహమ్మారి సమయంలో ఆన్‌లైన్ తరగతులకు ప్రాథమిక అవసరాలను అందించడంలో ప్రభుత్వం విఫలమైందని సంజయ్ తెలిపారు. విద్యార్థుల వైఫల్యాలు, ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని, పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని బండి హెచ్చరించారు.