Site icon HashtagU Telugu

Bandi Sanjay:బండి సంజయ్ దీక్ష భగ్నం .. అరెస్ట్

Bandi arrest

Bandi arrest

కరీంనగర్: జీవో 317 సవరించాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న జాగరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయన దీక్ష చేస్తున్న క్యాంప్ కార్యాలయం నుంచి ఆయన్ను తరలించారు. అంతకు ముందు తమ దీక్షను అడ్డుకుని తన క్యాంప్ ఆఫీస్‌కు వచ్చి దాడి చేసే పర్మిషన్ ఎవరిచ్చారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని, దీక్ష చేస్తుంటే అడ్డుకోవడం దారుణమని ఆయన విమర్శించారు. కరోనా నిబంధనల పేరుతో అడ్డుకోవాలని చూస్తున్నారని, రూల్స్ అధికార పక్షానికి ఉండవా అని బండి ప్రశ్నించారు. బీజేపీ కార్యకర్తలపై చేయి చేసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కరీంనగర్‌లో చేపట్టిన జాగరణ దీక్ష దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీక్షా శిబిరం దగ్గర పోలీసులు-బీజేపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో కరీంనగర్ ఎంపీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత ఏర్పడింది.

317 జీవోను సవరించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలకు సంఘీభావంగా కరీంనగర్‌లో ఆదివారం రాత్రి ఎంపీ క్యాంపు కార్యాలయం వద్ద దీక్షకు సిద్ధమయ్యారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో అనుమతి లేకపోవడంతో పోలీసులు భారీగా మోహరించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు.. పోలీసులు, సీఎం కేసీఆర్, కేటీఆర్, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.