Balapur laddu : ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించే బాలాపూర్ గణేశ్ లడ్డూ ఈ ఏడాది మరోసారి రికార్డు స్థాయిలో వేలం దక్కించుకుని వార్తల్లో నిలిచింది. గణేశ్ నవరాత్రుల ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈ లడ్డూ, 2025లో ఏకంగా రూ.35 లక్షలకు పలికింది. ఈ వేలంలో కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ విజేతగా నిలిచారు. ఆయన అత్యధిక ధరకు లడ్డూను దక్కించుకోవడంతో బాలాపూర్ ఉత్సవ కమిటీ ఆయనను ఘనంగా సన్మానించింది. గత ఏడాది రూ.30.01 లక్షలకు పలికిన ఈ లడ్డూ, ఈసారి రూ.4.99 లక్షలు అధికంగా ధరను సాధించింది. ఇది ఇప్పటివరకు బాలాపూర్ లడ్డూ చరిత్రలో రెండో అత్యధిక ధర కావడం విశేషం.
Read Also: PM Modi : భారత్–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!
ప్రతీ ఏడాదిలా ఈసారి కూడా వేలానికి ప్రజల్లో భారీ ఆసక్తి కనిపించింది. మొత్తంగా 38 మంది వేలంలో పాల్గొనడానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఉదయం ప్రారంభమైన ఈ వేలం, పెద్ద ఎత్తున హరివేణుల మధ్య కొనసాగింది. ఎప్పటికప్పుడు ధర పెరుగుతుండటంతో ఉత్సాహం ఊపందుకుంది. చివరకు లింగాల దశరథ్ గౌడ్ రూ.35 లక్షలతో గణేశుడి ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు. బాలాపూర్ గణేశ్ ఉత్సవాలకు ఇది ఒక సంప్రదాయమైంది. ఇక్కడి లడ్డూ వేలం కేవలం ఆర్థిక అంశంగా కాకుండా, ఆధ్యాత్మిక విశ్వాసంగా ప్రజలలో ప్రాచుర్యం పొందింది. ఈ లడ్డూను తీసుకెళ్లి భక్తులు తమ ఇంట్లో లేదా వ్యవసాయ భూముల్లో చల్లుతారు. దీని ద్వారా శాంతి, ఐశ్వర్యం లభిస్తుందని నమ్మకం. ఇక, బాలాపూర్ నుండి ప్రారంభమయ్యే గణేశ్ శోభాయాత్ర నగరమంతా వేడుకలతో ఉత్సాహభరితంగా సాగనుంది. ఈ లడ్డూ వేలం గణేశ్ ఉత్సవాల్లో ప్రారంభ ఘట్టంగా పరిగణించబడుతుంది. ఇంతటి గొప్ప సమర్పణతో బాలాపూర్ గణేశ్ లడ్డూ మళ్లీ ప్రజల భక్తి, ఆసక్తులకు కేంద్ర బిందువిగా మారింది.
కాగా, గతేడాది స్థానికుడైన కొలను శంకర్ రెడ్డి అనే వ్యక్తి 30 లక్షల 1000 రూపాయలకు లడ్డూను సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాదితో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలంపాట 31 ఏళ్లు పూర్తి చేసుకుంది. బాలాపూర్ లడ్డూవేలాన్ని తొలిసారిగా 1994లో నిర్వహించారు. తొలిసారి బాలాపూర్ గ్రామానికే చెందిన కొలను మోహన్ రెడ్డి రూ.450కు లంబోదరుడిని లడ్డూ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ప్రతి ఏడాది రికార్డు ధరలు పలుకుతూ లడ్డూ ప్రసాదం రూ.వందల నుంచి రూ.లక్షలకు చేరింది. ప్రస్తుతం రూ. 35 లక్షలకు చేరుకుంది. కాగా, బాలాపూర్ లడ్డూ కోసం గత ఆరేళ్లుగా వేలంలో పాల్గొంటున్నట్ల దశరథ్ గౌడ్ వెల్లడించారు. ఈసారి వేలంలో లడ్డూ దక్కించుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆ భగవంతుడి దయ వల్లే తాను ఈసారి లడ్డూ దక్కించుకున్నట్లు తెలిపారు.