ఐపీఎల్ 2022 సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరోసారి ఉలిక్కిపడింది. ప్రస్తుత సీజన్‌లో రెండో కరోనా కేసు నమోదయింది. ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజియో ప్యాట్రిక్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవగా… తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోని కీలక ఆటగాడు కరోనా మహమ్మారి భారిన పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ఆటగాడిని ఐసోలేషన్‌కు తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. తొలుత కరోనా బారిన పడ్డ ఫిజియో ప్యాట్రిక్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు సభ్యులతో కలియతిరగడంతో ఆటగాళ్లందరికీ గత రెండు రోజులుగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా నిర్వహించిన పరీక్షల్లో ఢిల్లీ కీలక ఆటగాడికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది.
ఈ అంశంపై ఢిల్లీ ఫ్రాంచైజీ అధికారి ఒకరు మాట్లాడుతూ.., కోవిడ్ బారిన పడిన ఢిల్లీ జట్టు క్రికెటర్ కు ఎలాంటి లక్షణాలు లేవని, అయినప్పటికీ అతన్ని వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని ఆయన పేర్కొన్నాడు. ఈ విషయాన్ని డీసీ యాజమాన్యం సైతం పరోక్షంగా దృవీకరించింది. ఇదిలా ఉంటే, ఎంసీఏ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్లు బుధవారం రాత్రి 7:30 గంటలకు తలపడనుంది. ప్రస్తుత సీజన్‌లో డీసీ ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలుపొంది, మరో మూడింటిలో ఓటమిపాలైంది. ప్రస్తుతానికి ఆ జట్టు 4 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 3 విజయాలు 3 అపజయాలతో 6 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతుంది.