Site icon HashtagU Telugu

Baba Siddique Shot Dead: ఎన్సీపీ నేత బాబా సిద్ధిక్ దారుణ హత్య – ముంబైలో రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం

Ncp Leader Baba Siddique

Ncp Leader Baba Siddique

ముంబై: (Baba Siddique) ఎన్సీపీ సీనియర్ నేత బాబా సిద్ధిక్ శనివారం రాత్రి దుండగుల కాల్పులకు బలయ్యారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపి, తీవ్ర గాయాలు కలిగించారు. వెంటనే ఆసుపత్రికి తరలించినా, చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. బాబా సిద్ధిక్, తన కుమారుడు జిషాన్ సిద్ధిఖీ కార్యాలయం వెలుపల ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయనకు ఒంటిపై మూడు రౌండ్లు కాల్పులు జరిగినట్లు తెలుస్తోంది.

ఈ దారుణ ఘటనలో ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, మిగిలిన వ్యక్తులను వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సిద్దిక్ పై దాడి మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది.

సిద్దిక్ తండ్రిగా, రాజకీయ నాయకుడిగా మహారాష్ట్రలోనే కాకుండా బాలీవుడ్ వర్గాల్లో కూడా ప్రసిద్ధుడు. గతంలో కాంగ్రెస్ పార్టీలో ప్రధాన నేతగా ఉన్న సిద్ధిక్, కొన్ని నెలల క్రితం అజిత్ పవార్ వర్గం నాయకత్వంలోని ఎన్సీపీలో చేరారు.

ఈ ఘటన ముంబై రాజకీయ ప్రముఖుల్లో భద్రతపై ఆందోళనలను పెంచింది. పోలీసులు కేసు త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజల సహకారంతో దర్యాప్తు వేగవంతం చేయాలని కోరుతున్నారు.