Shane Warne: స్పిన్ దిగ్గజం హఠాన్మరణం!

ప్రపంచ క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ హఠాన్మరణం చెందాడు.

  • Written By:
  • Updated On - March 5, 2022 / 08:45 AM IST

ప్రపంచ క్రికెట్‌లో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ స్పిన్నర్ షేన్‌వార్న్ హఠాన్మరణం చెందాడు. థాయ్‌లాండ్‌లోని ఓ విల్లాలో వార్న్ మృతి చెందాడు. బంతిని తిప్పడంలో తనకు తానే సాటిగా ఘనత సాధించిన ఈ ఆసీస్ దిగ్గజం మృతితో క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. క్రికెట్‌లో ఆస్ట్రేలియా అంటే ఫాస్ట్ బౌలర్లే గుర్తొస్తారు.. అలాంటి దేశం నుంచి స్పిన్నర్‌గా రాణించడం.. అందులోనూ అత్యున్నత స్థాయికి చేరుకోవడం సాధారణ విషయం కాదు. అలాంటి ఘనత సాధించిన బౌలర్ షేన్‌వార్న్.. కంగారూ గడ్డపై బంతిని అనూహ్యంగా తిప్పిన ఈ లెగ్‌స్పిన్ దిగ్గజం హఠాన్మరణం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 1992లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వార్న్ 15 ఏళ్ళ పాటు తనదైన ముద్ర వేశాడు. జట్టులోకి వచ్చిన కొద్ది కాలంలోనే తన స్పిన్ మ్యాజిక్‌తో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టించాడు. ముఖ్యంగా తమకు చిరకాల ప్రత్యర్థి ఇంగ్లాండ్‌పై అందులోనూ యాషెస్ సిరీస్‌ విజయాల్లో వార్న్ పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. 1993 యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ బ్యాటర్ గాట్లింగ్‌ను ఔట్ చేసిన తీరు బాల్ ఆఫ్ ది సెంచరీగా మిగిలిపోయింది.

ఆస్ట్రేలియా తరపున 145 టెస్టుల్లో 708 వికెట్లు, 194 వన్డేల్లో 293 వికెట్లు పడగొట్టిన వార్న్‌ టెస్టుల్లో 700 వికెట్ల మైలురాయి అందుకున్న తొలి బౌలర్‌గా రికార్డ్ సృష్టించాడు. ఓవరాల్‌గా అత్యధిక వికెట్ల జాబితాలో మురళీధరన్‌ తర్వాత రెండో స్థానంలో ఉన్న ఈ ఆసీస్ లెజెండ్‌ 2007లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టుల్లో 37 సార్లు 5 వికెట్లు, 10 సార్లు 10 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డులకెక్కాడు. వార్న్ బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు దిగ్గజ బ్యాటర్లు సైతం ఇబ్బంది పడిన సందర్భాలున్నాయి. ముఖ్యంగా వరల్డ్‌క్రికెట్‌లో సచిన్‌-వార్న్, లారా-వార్న్ పోరాటం ఫ్యాన్స్‌ను ఎంతగానో అలరించింది. ఐపీఎల్ తొలి సీజన్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన షేన్‌వార్న్ 2011 వరకూ సారథిగా ఉన్నాడు. వార్న్ సాధించిన రికార్డులకు గానూ 2018లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌తో గౌరవించింది. రిటైర్మెంట్ తర్వాత కామెంటేటర్‌గా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన హఠాన్మరణం క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. సచిన్, సెహ్వాగ్ , లక్ష్మణ్ , లారా వంటి దిగ్గజాలు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.