Ind Vs Aus: ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం

మూడో టెస్టులో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 75 పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా 1 వికెట్ కోల్పోయి చేదించింది.

  • Written By:
  • Updated On - March 3, 2023 / 11:38 AM IST

అద్భుతాలేమీ జరగలేదు…బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఇండోర్ వేదికగా జరిగిన మూడో టెస్టులో భారత్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.
75 పరుగుల టార్గెట్ ను ఆస్ట్రేలియా 1 వికెట్ కోల్పోయి చేదించింది. మూడోరోజు భారత స్పిన్నర్లు అద్బుతం చేస్తారేమో అని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. రెండో బంతికే ఓపెనర్ ఉస్మాన్ ఖావాజాను అశ్విన్ ఔట్ చేయడంతో ఆశలు రేకెత్తాయి. అయితే తర్వాత హెడ్, లబుషేన్ ఇద్దరూ కలిసి భారత ఆశలపై నీళ్లు చల్లారు. భారత బౌలర్లపై ఎదురు దాడికి దిగి మూడో రోజు లంచ్ లోపే మ్యాచ్ ముగించారు. అశ్విన్, జడేజా స్పిన్ ను వీళ్లు సమర్థంగా ఎదుర్కొన్నారు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినా.. తర్వాత వరుసగా బౌండరీలు బాదుతూ సులువుగా లక్ష్యాన్ని ఛేదించగలిగారు. దీంతో 18.5 ఓవర్లలోనే ఆస్ట్రేలియా ఈ టార్గెట్ చేజ్ చేసింది. హెడ్ 49, లబుషేన్ 28 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. ఈ విజయంతో నాలుగు టెస్టుల సిరీస్ లో భారత్ ఆధిక్యం 2-1కి తగ్గింది.

ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్ లోనూస్పిన్ వ్యూహంలో చిక్కుకుని భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాను ఆసీస్ స్పిన్నర్లు 109 పరుగులకే పరిమితం చేశారు. ప్రధాన బ్యాటర్లలో ఏ ఒక్కరూ క్రీజులో నిలవలేదు.ఆసీస్ పేసర్ల కేవలం ఏడు ఓవర్లే వేయగా.. భారత్‌ ఇన్నింగ్స్‌ 33 ఓవర్లలో ముగిసింది. కోహ్లీ చేసిన 22 పరుగులే భారత్‌ ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌. ఆసీస్ బౌలర్లలో కునేమన్‌ 5 , ల్యాన్ 3 , మర్ఫీ 1 వికెట్ పడగొట్టారు. తర్వాత ఆస్ట్రేలియా 197 రన్స్ కి ఆలౌట్ అయింది.కీలకమైన 88 పరుగుల ఆధిక్యం ఆ జట్టుకు దక్కింది. జడేజా 4 , ఉమేష్, అశ్విన్ చెరో మూడు వికెట్లతో చెలరేగారు.

కాగా రెండో ఇన్నింగ్స్ లోనూ ఆసీస్ స్పిన్నర్ నాథన్ ల్యాన్ ధాటికి భారత్ కుప్పకూలింది. పుజారా తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. పుజారా హాఫ్ సెంచరీ చేయగా… భారత్ 163 పరుగులకు ఆలౌట్ అయింది. ల్యాన్ 8 వికెట్లతో భారత పతనాన్ని శాసించాడు. సీరీస్ లో చివరి టెస్ట్ మార్చి 9 నుంచి అహ్మదాబాద్ లో జరుగుతుంది.