తాజాగా ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదకర ఘటన గురించి మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. కొన్ని ఫ్యామిలీలను మొత్తం బలి తీసుకుంది. ఇంకొందరు కుటుంబంలో కుటుంబ పెద్దలను కోల్పోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీవ్రంగా కలిచివేసింది. అయితే కొందరు మానవత్వం లేని మనుషులు ఈ ప్రమాదాన్ని కూడా వారికి అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఉపయోగించుకొని ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం నకిలీ సర్టిఫికెట్లను క్రియేట్ చేసుకుంటున్నారు.
ప్రమాదంలో మరణించిన వారికి రిజర్వేషన్ చేయించుకున్న వారికి టికెట్ తీసుకున్న వారికి చివరికి టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వారికి కూడా నష్టపరిహారం అందిస్తాము అని ఒడిశా ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొందరు స్వార్థపరులు చేతివాటం చూపిస్తున్నారు. కొందరు దుర్మార్గులు ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని కోసం ఆశపడి చనిపోయింది తన వాళ్లే అంటూ నకిలీ డాక్యుమెంట్ల తో శవాలను తీసుకెళ్లి పోతున్నారు. తాజాగా ఆ మోసాన్ని ఒడిశా ప్రభుత్వం గుర్తించి అప్రమత్తమయ్యింది.
ఒడిశా కటక్ సమీపంలోని మనియబంధ గ్రామానికి చెందిన గీతాంజలి గుప్తా అనే 35 ఏళ్ల మహిళ తన భర్త విజయ్ దత్తా అనే 47 ఏళ్ల వ్యక్తి కనిపించడం లేదని మతం జరిగిన రోజు తన భర్త కోరమండల్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించాడని అప్పటినుంచి తన భర్త ఆచూకీ తెలియడం లేదు అని పోలీసులకు చెబుతూ దొంగ కన్నీరు కార్చింది. ప్రమాద బాధితులను తరలించిన ఆసుపత్రులకు కూడా వెళ్ళానని అయినా కూడా లాభం లేకుండా పోయిందని పోలీసుల ముందు దొంగ నాటకాలు ఆడింది. ఆ తర్వాత పోలీసులు ఆమెను ఒడిశా ప్రమాద మృతదేహాలు ఉంచిన ప్రాంతానికి తీసుకెళ్లగా అక్కడున్న ఫోటోలను చూసుకోవాలని సూచించారు.
కొన్ని ఫోటోలు చూసిన తర్వాత ఒక వ్యక్తి ఫోటో చూపిస్తూ అతనే తన భర్త అని ఆమె తెలిపింది. భర్త డెడ్ బాడీ అని చెప్పి తీసుకెళ్లడానికి గీతాంజలి ఆధార్ కార్డు చూపించగా అందులో గీతాంజలి వయసు 60 ఏళ్లుగా ఉంది కానీ ఆమెకు అంత వయస్సు ఉన్నట్టుగా కనిపించలేదు. దానికి తోడు ఆమె ప్రవర్తన పై పోలీసులకు అనుమానం రావడంతో ఆధార్ కార్డు ఆధారంగా స్థానిక పోలీస్ స్టేషన్లో విచారించగా గీతాంజలి భర్త చనిపోలేదని బతికే ఉన్నాడని తెలిసింది. అంతే కాకుండా ఆ కోరమాండల్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించలేదని తెలిసింది. దాంతో సదరు మహిళను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మృతుల కుటుంబాలకు ఇచ్చే పది లక్షల పరిహారం కోసమే ఇలా నకిలీ పత్రాలను తీసుకువచ్చినట్లు ఆమె అంగీకరించింది. దాంతో వెంటనే అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం దానిని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి అప్రమత్తమయింది.