UP: యూపీలో దారుణం, మృతదేహాన్ని 10కిమీ ఈడ్చుకెళ్ళిన కారు.

అప్పట్లో ఢిల్లీలో ఒక యువతిని కారు సుమారుగా 20 కిమీ. లాక్కెళ్ళింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన మరువకముందే..

  • Written By:
  • Publish Date - February 7, 2023 / 10:04 PM IST

UP: అప్పట్లో ఢిల్లీలో ఒక యువతిని కారు సుమారుగా 20 కిమీ. లాక్కెళ్ళింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ సంఘటన మరువకముందే.. అదే తరహా ఘటన మరొకటి జరగడం కలకలం రేపుతోంది. కారు కింద ఇరుక్కుకుపోయిన మృతదేహాన్ని అలాగే 10 కిలోమీటర్లకు పైగా ఈడ్పుకెళ్లాడు ఓ వ్యక్తి. మథురలో యుమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై మంగళవారం నాడు ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో వాహనం నడుపుతున్న దిల్లీ నివాసి అయిన వీరేంద్ర సింగ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

వీరేంద్ర సింగ్ చెప్పిన విషయం విని పోలీసులు షాక్ అయ్యారు. కారు కింద ఉన్న వ్యక్తి వేరే ప్రమాదంలో చనిపోయాడని, కానీ తన వాహనం కింద చిక్కుకున్నాడని తాను పేర్కొన్నాడు. వీరేంద్ర సింగ్‌ మంగళవారం 4Am సమయంలో యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఆగ్రా నుంచి నోయిడాకు వెళ్తుండగా.. మథుర సమీపంలోని టోల్‌ గేట్‌ వద్ద అతని కారు కింద ఓ వ్యక్తి మృతదేహం ఇరుక్కుపోయి ఉన్నట్లు అక్కడి సిబ్బంది గుర్తించారు. అప్పటికే మృతదేహం నుజ్జునుజ్జు అయిపోయింది.

ఆ సమయంలో అక్కడ దట్టమైన పొగమంచు ఉండడంతో దారి సరిగ్గా కనిపించలేదని, ఈ క్రమంలోనే వేరే ఇతర ప్రమాదానికి గురైన వ్యక్తి తన కారు కింద చిక్కుకుపోయిందని ఆ వ్యక్తి పోలీసులకు తెలిపాడు. తన కారు క్రింద మృతదేహం ఉన్న విషయం అసలు తాను గుర్తించలేదని చెప్పాడు. ఈ క్రమంలో.. అసలు ఏం జరిగింది అనే విషయాన్ని రాబట్టడానికి పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసి, పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నారు. ఇంతకీ మృతుడు ఎవరు? అతను చనిపోవడానికి కారణం ఎవరు? ఎలా చనిపోయాడనేది గుర్తించేందుకు పోలీసులు పుటేజీలను, సమీప గ్రామవాసులను విచారిస్తున్నారు.

మొన్నీమధ్య కొత్త సంవత్సరం వేడుకల వేళ.. దిల్లీలో ఇదే తరహాలో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా చర్చనీయాంశమైంది. నూతన సంవత్సర వేడుకలను ముగించుకుని స్కూటీపై తిరిగెళ్తున్ను అంజలి అనే అమ్మాయిని ఒక కారు వేగంగా ఢీకొట్టింది. ఆ తర్వాత ఆగకుండా 20 కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లింది. కారు చక్రాల్లో చిక్కుకున్న అంజలి శరీరం పూర్తిగా గుర్తుపట్టలేనంతగా ఛిద్రమవడం అందర్నీ కలచివేసింది. దీనికి సంబంధించి ఇప్పటివరకు పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. కాగా ఇలాంటి ఘటనలు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది.