Bypoll : ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ పోలింగ్ ప్రారంభం.. 123 స‌మ‌స్యాత్మ‌క కేంద్రాలు గుర్తింపు

  • Written By:
  • Updated On - June 23, 2022 / 11:08 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఆత్మకూర్ నియోజకవర్గంలోని 279 పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేశామని.. 1,339 జనరల్, 1032 మంది పోలీసు సిబ్బందిని నియ‌మించిన‌ట్లు అధికారులు తెలిపారు. వీరితోపాటు 142 మంది మైక్రో అబ్జర్వర్లు, 38 మంది సెక్టార్ అధికారులు విధులు నిర్వహించనున్నారు. మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు.

నియోజకవర్గ పరిధిలో 123 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ ఎంఎన్ హరేందిర ప్రసాద్ తెలిపారు. ఓటరు స్లిప్పులతో పాటు ఓటర్ ఐడీ, ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, పాస్‌పోర్టు తదితరాలను తప్పనిసరిగా తీసుకురావాలని, ఓటర్లందరికీ ఓటరు స్లిప్పులు పంపిణీ చేశామని హరేందిర ప్రసాద్ తెలిపారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిర్భయంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. దివంగ‌త మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంతో ఆత్మకూరు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఉప ఎన్నికలో వైఎస్సార్‌సీపీ తరపున గౌతంరెడ్డి సోదరుడు మేకపాటి విక్ర౦రెడ్డి, బీజేపీ తరఫున భరత్‌కుమార్‌తో పాటు మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నెల 26న కౌంటింగ్‌ జరగనుంది.