Site icon HashtagU Telugu

Bypoll : ఆత్మ‌కూరులో కొన‌సాగుతున్న పోలింగ్‌.. మ‌ధ్యాహ్నం 1గంట వ‌ర‌కు 44.14 శాతం పోలింగ్ న‌మోదు

poling

poling

ఆత్మకూరులో ఉప ఎన్నిక పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతుంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 44.14 శాతం పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం బాగా నమోదవ్వ‌డంతో వైసీపికీ అనుకూలంగా ఉంద‌నే సంకేతాలు ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. పోలింగ్ ప్రారంభమైన రెండు గంటల్లోనే ఉదయం 11 గంటల వరకు 24.92, ఉదయం 9 గంటల వరకు 11.56 శాతం నమోదైంది. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కెవిఎన్ చక్రధర్ బాబు, జనరల్ అబ్జర్వర్ ఎం సురేష్ కుమార్, ఎస్పీ సిహెచ్ విజయరావు తదితరులు కలెక్టరేట్ నుంచి తొలుత వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. మర్రిపాడు మండలం డీసీ పల్లిలో కలెక్టర్‌ పర్యటించి 42, 43 పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితులను పరిశీలించారు. సంగం మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను, మండలంలోని గాంధీజన సంగమాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆత్మకూర్‌ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. అనంతసాగరం మండలం తదితర మండలాల్లో ఆయన పర్యటించి పోలింగ్ తీరును పరిశీలించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు రాకుండా నియోజకవర్గ సరిహద్దుల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం వరకు నియోజకవర్గం అంతటా ఎలాంటి అలజడి జరగలేదు.