అమరావతిలో అటల్ జయంతి వేడుకలు..14 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు

దేశవ్యాప్తంగా అభిమానులు, నాయకులు అటల్ జీని స్మరించుకునే ఈ రోజున అమరావతిలో నిర్వహించిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Published By: HashtagU Telugu Desk
Atal Jayanti celebrations in Amaravati.. CM Chandrababu Naidu unveils 14-foot bronze statue

Atal Jayanti celebrations in Amaravati.. CM Chandrababu Naidu unveils 14-foot bronze statue

. ‘అటల్ స్మృతి వనం’కు శంకుస్థాపన

. 14 అడుగుల వాజ్‌పేయీ విగ్రహ ఆవిష్కరణ

. నేతల సందేశాలు..అటల్ జీ ఆదర్శాలే మార్గదర్శకం

Atal Bihari Vajpayee birth anniversary: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతి వేడుకలు శోభాయమానంగా జరిగాయి. ప్రజాస్వామ్య విలువలు, సుపరిపాలన, జాతీయ ఐక్యతకు అటల్ జీ చేసిన సేవలను స్మరించుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఘన కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశవ్యాప్తంగా అభిమానులు, నాయకులు అటల్ జీని స్మరించుకునే ఈ రోజున అమరావతిలో నిర్వహించిన వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

వెంకటపాలెం సమీపంలోని సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఆనుకుని 2.5 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘అటల్ స్మృతి వనం’ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిసి ప్రారంభించారు. ఈ స్మృతి వనం పర్యావరణ హితం, సాంస్కృతిక విలువలు, చరిత్రను కలగలిపిన విధంగా రూపుదిద్దుకుంది. ప్రజలకు విశ్రాంతి, ఆలోచనలకు ప్రేరణనిచ్చేలా పచ్చదనంతో పాటు స్మరణీయ నిర్మాణాలతో ఈ వనాన్ని తీర్చిదిద్దారు. అమరావతి నగరానికి ఇది ఒక సాంస్కృతిక చిహ్నంగా నిలవనుంది.

స్మృతి వనంలో ఏర్పాటు చేసిన 14 అడుగుల ఎత్తైన అటల్ బిహారీ వాజ్‌పేయీ భారీ కాంస్య విగ్రహాన్ని నేతలు ఆవిష్కరించారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరం అటల్ జీకి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వాజ్‌పేయీ నాయకత్వ లక్షణాలు, ఆయన కవితాత్మక రాజకీయ దృష్టి, దేశాన్ని ముందుకు నడిపించిన నిర్ణయాలు సభికులను భావోద్వేగానికి గురిచేశాయి. విగ్రహం రూపకల్పనలో ఆయన గంభీరత, మానవీయత స్పష్టంగా ప్రతిబింబించేలా తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. దేశాభివృద్ధిలో అటల్ బిహారీ వాజ్‌పేయీ పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, రాజధాని అమరావతికి ప్రత్యేకతను చేకూర్చేలా ఈ స్మృతి వనాన్ని రూపొందించినట్లు తెలిపారు. ఇది భవిష్యత్ తరాలకు అటల్ జీ ఆదర్శాలను చాటిచెబుతుందన్నారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మాట్లాడుతూ అటల్ జీ చూపిన సుపరిపాలన మార్గంలోనే దేశం ముందుకు సాగుతోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని అటల్ జీకి నివాళులు అర్పించారు.

  Last Updated: 25 Dec 2025, 12:07 PM IST