Site icon HashtagU Telugu

ATA:అమెరికాలో అంగ‌రంగ వైభ‌వంగా `ఆటా`ప్రారంభం

Ata

Ata

అమెరికాలోని వాషింగ్ట‌న్ డీసీలో `ఆటా` 17 జాతీయ మహాస‌భలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభం అయ్యాయి. జూలై1న బాంక్వెట్‌ నైట్‌తో ఆటా మహాసభ ప్రారంభం అయింది. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న తరుణ్‌జిత్‌ సింగ్‌ సంధు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. వాషింగ్టన్‌ డీసి మేయర్‌ మురళీ బౌసర్‌ గౌరవ అతిధిగా పాల్గొన్నారు. వీరితోపాటు అనేక మంది ప్రముఖులు కూడా బాంక్వెట్‌ డిన్నర్‌కు హాజ‌ర‌య్యారు.
ఇండియ‌న్ టైం ప్ర‌కారం సాయంత్రం 6 నుంచి 11 వరకు బాంక్వెట్‌ నైట్‌ కార్యక్రమాలు జ‌రిగాయి. గణేశ స్తుతితో కార్యక్రమాలను ప్రారంభించారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వందేమాతరం పేరుతో దేశభక్తిని పెంపొందించేలా ఇండియా నుంచి వచ్చిన కళాకారులతో ప్రదర్శన ఇచ్చారు. గాయని సునీత వ్యాఖ్యాతగా, గాయకులు రామ్‌ మిర్యాల, మంగ్లీల గానాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. 14 రంగాల్లో విశేష ప్రతిభ చాటిన వారికి ఆటా అవార్డులను కూడా ఈ కార్యక్రమంలోనే బహుకరించారు. సెలబ్రిటీలను పరిచయం చేయడంతోపాటు వారిని గౌరవించారు. బాంక్వెట్‌ డిన్నర్‌ తరువాత దాతల సత్కారం, గోల్ఫ్‌ విజేతలకు అవార్డుల బహుకరణ జ‌రిగింది. బాంకెట్‌ వేడుకల్లో సింగర్‌ రామ్‌ మిరియాల స్పెషల్‌ మ్యూజిక్‌ నైట్ అల‌రించింది.

జూలై 2న ఉదయం నుంచే ఆటా పరేడ్‌ ప్రారంభం అవుతుంది. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా కళా ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. కన్వెన్షన్‌ సెంటర్‌లోని గ్రాండ్‌ లాబీలో వెల్‌కం రిసెప్షన్‌తో వేడుకలు ప్రారంభమవుతాయి. తెలుగే మన వెలుగు…తెలుగు మన గురువు పేరుతో ఆటా వారి ప్రారంభ నృత్యరూపకం జరుగుతుంది. ప్రముఖ గేయరచయిత చంద్రబోస్‌ స్వరపరిచిన ప్రారంభోత్సవ గీతాన్ని గాయకులు కొమాండూరి రామాచారి ఆలపిస్తారు. దాతల సత్కారం, అధ్యక్షుల ప్రసంగం వంటివి జరుగుతాయి. ఈషా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు, యోగా గురు పద్మ విభూషణ్‌ సద్గురు జగ్గీ వాసుదేవన్‌ అతిథులతో మాట్లాడనున్నారు. అలాగే ఆటా కన్వెన్షన్‌లో భాగంగా హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ రామచంద్ర మిషన్‌ వేడుకలు నిర్వహించనున్నారు. చిన్నారుల కోసం ప్రత్యేక రూమ్‌లో వారికి అవసర మైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. హార్ట్‌ఫుల్‌ నెస్‌ దాజి ప్రసంగం, కార్యక్రమా లు, బిజినెస్‌ ఫోరం ఆధ్వర్యంలో ప్రముఖు లతో సమావేశం, రaుమ్మంది నాదం ఫైనల్స్‌ పోటీలు, టిక్‌టాక్‌ షార్ట్‌ ఫిలింస్‌ ప్రదర్శన, ఆటా అందాల పోటీలు ఫైనల్స్‌, సయ్యంది పాదం ఫైనల్స్‌ పోటీలు, ఎన్నారై ప్యానల్‌ తరపున చర్చా కార్యక్రమాలు, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రముఖులతో చర్చా కార్యక్రమం, తెలంగాణ మంత్రులు, ఆంధ్ర మంత్రులతో సమావేశం, ఉమెన్స్‌ ఫోరం తరపున మహిళలతో చర్చా గోష్టులు, ఇతర కార్యక్రమాలు, అలూమ్ని ఫోరం ఆధ్వర్యంలో పాత మిత్రుల కలయిక కార్యక్రమం వంటివి జరుగుతుంది. కవి జొన్నవిత్తుల పేరడి, సినిమా కథలు అప్పుడు ఇప్పుడు వంటి కార్యక్రమాలను ఈ సాహిత్య కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేశారు. యుఎస్‌ పొలిటికల్‌ ఫోరం ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు జరగనున్నాయి. సీనియర్‌ సిటిజెన్స్‌ కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ పుట్టినరోజు వేడుకలను కూడా నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగంగా తనికెళ్ళ భరణితో ఆధ్యాత్మిక ప్రసంగం, కిరణ్‌ చుక్కపల్లితో హిమాలయన్‌ యోగ కార్యక్రమం ఉంటుంది. డాక్టర్‌ ఖాదరవలితో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కార్యక్రమం జరుగుతుంది. లీగల్‌ ఫోరం వాళ్ళు కూడా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రియల్‌ ఎస్టేట్‌, స్పాన్సర్లతో ఓ కార్యక్రమం కూడా జరుగుతుంది. మేట్రిమోని కమిటీ ఆధ్వర్యంలో వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం ఉంటుంది.
రెండో రోజు సాయంత్రం సంగీత దర్శకులు ఎస్‌.థమన్‌ నేతృత్వంలో విభావరి ఏర్పాటు చేశారు.
జులై 3

ఉదయం తిరుమల తిరుపతి వేంకటేశ్వరుడి కళ్యాణం నిర్వహించ నున్నారు. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో టీటీడి ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి ఇతర అధికారులు పాల్గొంటున్నారు. శ్రీనివాసుడి కళ్యాణంలో భాగంగా ప్రముఖ నేపథ్య గాయకులు పద్మశ్రీ శోభారాజు, నిహాల్‌ కొండూరి ఆధ్యాత్మిక సంగీతంతో ఆహూతులను భక్తి పారవశ్యం లోకి తీసుకెళ్లనున్నారు. సిఎంఇ కార్యక్రమంలో భాగంగా వైద్యరంగంపై సదస్సు జరుగుతుంది. బిజినెస్‌ ఫోరం ఆధ్వర్యంలో వాణిజ్య ప్రముఖులతో సమావేశం నిర్వహిస్తున్నారు. సద్గురు ప్రసంగం, ఆటా సయ్యంది పాదం, హార్ట్‌ఫుల్‌ నెస్‌ మెడిటేషన్‌, అవధాన కార్యక్రమం, టిడిఎఫ్‌ కార్యక్రమం, అలూమ్ని కమిటీ ఆధ్వర్యంలో కళాశాలల పూర్వ విద్యార్థుల పరిచయ కార్యక్రమాలు జరుగుతాయి. కిడ్స్‌ కార్యక్రమాలు, ఉమెన్స్‌ ఫోరం ఆధ్వర్యంలో మహిళలకోసం ప్రత్యేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేశారు. స్థానిక కళాకారుల నృత్య ప్రదర్శనలు ఉంటాయి. సాహిత్య సమావేశాలు, సీనియర్‌ సిటిజన్ల కోసం ఓ కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమాలను కూడా నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఇ`గ్లోబల్‌ పేరుతో స్పాన్సర్లతో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. మేట్రిమోని ఫోరం ఆధ్వర్యంలో వధూవరుల తల్లితండ్రులతో సమావేశం ఇతర కార్యక్రమాలు జరుగుతాయి. సోషల్‌ మీడియా, యూత్‌ ఫోరం, టాలీ వుడ్‌, ఇతర కళాకారులు, ప్రముఖుల ప్రసంగాలతో 3వ రోజు కార్యక్రమా లను ఏర్పాటు చేశారు. 3వ రోజు గ్రాండ్‌ ఫినాలేలో భాగంగా ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ముగింపు వేడుకల్లో భాగంగా ఇళయ రాజా తన 32 మంది ట్రూప్‌తో అతిథులను అలరించనున్నారు.
సినీ కళాకారులు…

ఈ వేడుకలకు టాలీవుడ్‌ నుంచి పెద్ద ఎత్తున సినీతారలు అమెరికా వెళ్లారు. హీరోలు అడవి శేషు, డైరెక్టర్లు శేఖర్‌ కమ్ముల, అర్జున్‌రెడ్డి ఫేం సందీప్‌ వంగా, హీరోయిన్లు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నివేదా థామస్‌, డాన్స్‌ డైరెక్టర్‌ శేఖర్‌ మాస్టర్‌, వీజే సన్నీ, సింగర్‌ రాం మిరియాల, సింగర్‌ మంగ్లీ.. ఇంకా పలువురు ప్రముఖులు వేడుకలకు వస్తున్నారు. సాహితీ వేత్తలు జొన్నవిత్తుల రాంజోగయ్య శాస్త్రి, సీనియర్‌ నటులు తనికెళ్ల భరణి ప్రత్యేక ఆకర్షణగా నిలిచార. బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్‌ అష్టవధానంతో అలరించబోతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు ప్రత్యేక చిరునామా

పుట్టి పెరిగిన మాతృభూమిపై మమకారం చూపించేలా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఏపీకి అయిదు స్టాళ్లు, తెలంగాణకు అయిదు స్టాళ్లు ఇందులో ఉన్నాయి. రెండు ప్రభుత్వాలకు సంబంధించిన వివిధ కీలక అంశాలను ఈ స్టాళ్ల ద్వారా ప్రవాసాంధ్రులకు వివరించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల కోసం స్టూడెంట్‌ అవేర్‌నెస్‌ డెస్క్‌, అలాగే మెడికల్‌, టూరిజం, రియల్‌ ఎస్టేట్‌తో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలందిస్తారు.

భువనేష్‌ బుజాల, ఆటా అధ్యక్షుడు

కరోనా విపత్కర పరిస్థితుల నుంచి ప్రపంచం కోలుకున్న తర్వాత నిర్వహిస్తున్న అతిపెద్ద తెలుగు పండుగ ఇది. ప్రవాసాంధ్రులందరిని ఒక్కతాటిపైకి తెచ్చి ఒక కుటుంబం అన్న భావన తీసుకురావడానికే ఆటా మహాసభలను పెద్దఎత్తున ప్రారంభించాం. ఘనమైన తెలుగు వారసత్వాన్ని అందించడం, పుట్టిన నేలకు తమ వంతు సాయం అందించడం, కొత్త తరానికి స్పూర్తిదాయక సందేశం ఇవ్వడమే ఆటా ముందున్న లక్ష్యాలు. ఈ మహాసభలను విజయవంతం చేయడానికి అమెరికాలోని కొత్తతరం ముందుకు వచ్చి పనిచేస్తుండటం చాలా సంతోషంగా ఉంది. మన సంస్కృతి, మన సంప్రదాయాలను తెలియజేసేలా కార్యక్రమాలను కూడా ఇందులో ఏర్పాటు చేశాము.

ప్రముఖులతో సమావేశాలు

కాన్ఫరెన్స్‌ కన్వీనర్‌ సుధీర్‌ బండారు

ఆటా మహాసభలకు ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రముఖులతోపాటు, అమెరికాలో ఉన్న ప్రముఖులను కూడా ఒకే వేదికపై చూడవచ్చు. సినిమా తారలతోపాటు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, వాణిజ్య ప్రముఖులు, సాహితీవేత్తలు ఇలా ఎందరో ఈ మహాసభలకు వ‌చ్చారు. ఇంతమంది వస్తున్న ఈ కార్యక్రమంలో ఎన్నో మరచిపోలేని విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదిస్తున్నారు.