ఐదు రాష్ట్రాల్లో ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం మూటగట్టుకుంది. పార్టీ పనితీరు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులను సమీక్షించడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) ఆదివారం సాయంత్రం సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు సమావేశం జరగనుంది. ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి దారితీసిన పరిస్థితులు, కారణాలు చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇప్పటికే రాహుల్ సారథ్యం మసకబారుతుండటంతో కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారా.. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యాచరణ ఏవిధంగా ఉండబోతోంది? లాంటి విషయాలు ఆసక్తికరంగా మారనున్నాయి.
పంజాబ్ ముఖ్యమంత్రిగా నియమితులైన భగవంత్ మాన్ శనివారం ఉదయం చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్‌ను కలిశారు. అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌ను క్లీన్ స్వీప్ చేసి, 90 సీట్లకు పైగా గెలుచుకుంది. మాన్ మార్చి 16న నవాన్‌షహర్ జిల్లాలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్ కలాన్‌లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మంత్రి పదవుల కోసం హర్పాల్ సింగ్ చీమా, అమన్ అరోరా, బల్జిందర్ కౌర్, సరవ్‌జిత్ కౌర్ మనుకే, గుర్మీత్ సింగ్ మీత్ హయర్, బుధ్ రామ్, కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్, జీవన్‌జ్యోత్ కౌర్, డాక్టర్ చరణ్‌జిత్ సింగ్‌లతో సహా పలువురు ఎమ్మెల్యేల పేర్లు వినిపిస్తున్నాయి.
మరోవైపు, గోవాలో, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ శనివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ పిఎస్ శ్రీధరన్ పిళ్లైకి తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసారు. 40 మంది సభ్యుల అసెంబ్లీలో 20 సీట్లు గెలుచుకోవడం ద్వారా అతిపెద్ద శక్తిగా అవతరించింది. మరో మూడు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మణిపూర్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లలో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోగలిగింది.