Fishing on Highway: అస్సాం రాజధాని రోడ్డుపై చేపల జలకాలాట.. ఎందుకంటే?

చేపలు.. చెరువులు, నదులు, సరస్సులు, సముద్రాల్లో ఈదుతుంటే చూశాం. కానీ అస్సాం రాజధాని గౌహతిలో అవి నడి రోడ్డుపైకి వచ్చి ఈదాయి.

  • Written By:
  • Updated On - June 19, 2022 / 03:40 PM IST

చేపలు.. చెరువులు, నదులు, సరస్సులు, సముద్రాల్లో ఈదుతుంటే చూశాం. కానీ అస్సాం రాజధాని గౌహతిలో అవి నడి రోడ్డుపైకి వచ్చి ఈదాయి. ఇదెలా జరిగింది ? అంటే.. వరదల వల్ల జరిగింది. అస్సాం దుఃఖ దాయినిగా పేరొందిన బ్రహ్మపుత్ర నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. యావత్ అస్సాంలోని దాదాపు 90 శాతం భూభాగం ఇప్పుడు నీటిలోనే ఉంది. రాజధాని నగరం గౌహతిని వరద నీరు ముంచెత్తింది.

ఈ వరద నీటిలో ఏకంగా చేపలు కూడా కొట్టుకొచ్చాయి. గౌహతి నగర వీధుల్లో నిలిచిన వరద నీటిలో వేగంగా అటూ ఇటూ కదులుతూ ఈదాయి. అక్కడి నుంచి బయటపడేందుకు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి తన ట్విటర్ హ్యాండిల్ లో అప్ లోడ్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. అస్సాంలో వర్షాల కారణంగా విద్యుత్ సరఫరాకు పెను విఘాతం కలిగింది. మొబైల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. దీన్ని కూడా ఓ వ్యక్తి ఆదాయ మార్గంగా మార్చుకున్నాడు. జనరేటర్ ను రాన్ చేస్తూ.. మొబైల్ ఫోన్స్ రిఛార్జ్ చేసే బిజినెస్ ను ప్రారంభించాడు. దీనికి సంబంధించి ఒక నెటిజన్ షేర్ చేసిన పోస్ట్ కూడా వైరల్ అవుతోంది.

వరద బీభత్సం..

అసోం 32 జిల్లాల్లోని 4,296 గ్రామాలకు చెందిన 30 లక్షల మందిపై వర్షాలు, వరదలు ప్రభావం చూపాయి. గత ఐదు రోజుల్లో వరదలు, వర్షాలు, కొండచరియలు విరిగిపడిన కారణంగా మరణించిన వారి సంఖ్య 60కి చేరింది.మొత్తం 514 పునరావాస శిబిరాల్లో లక్షా 56 వేల 365 మంది తల దాచుకుంటున్నారు. 43 వేల హెక్టార్ల పంట నీట మునిగింది.నదీ పరీవాహక ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.