Asian Games 2023: హౌంగ్ ఛౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సెంచరీ ఖాయమైంది. 100 పతకాలు సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన మన అథ్లెట్లు దానిని అందుకున్నారు. శుక్రవారం వచ్చిన మెడల్స్ తో భారత్ పతకాల సంఖ్య 95కు చేరింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో 22 స్వర్ణాలు, 34 రజతాలు, 39 కాంస్యాలు ఉన్నాయి. ఇంకా పలు ఈవెంట్లలో భారత్ క్రీడాకారులు ఫైనల్ చేరుకోవడంతో మరికొన్ని పతకాలు చేరనున్నాయి. ఫైనల్ బెర్తులు ఖాయమవడంతో కబడ్డీ, పురుషుల క్రికెట్ , కాంపౌండ్ ఆర్చరీ, బ్యాడ్మింటన్ డబుల్స్ , బ్రిడ్జ్ ఈవెంట్లలో కనీసం రజతాలు రానున్నాయి. దీంతో వంద కంటే ఎక్కువ పతకాలే భారత్ సాధించనుంది. తద్వారా 72 ఏళ్ల తర్వాత పతకాల సంఖ్య మూడంకెలకు చేరిన ఘనత లభించనుంది. గత ఆసియా గేమ్స్‌లో భారత్ అత్యధికంగా 70 పతకాలు సాధించింది.
ఇవాళ హాకీలో భారత పురుషుల జట్టు అదరగొట్టింది. ఫైనల్లో జపాన్ ను చిత్తు చేసి స్వర్ణం కైవసం చేసుకుంది. పూర్తి ఆధిపత్యం కనబరిచిన భారత్ 5-1 గోల్స్ తేడాతో జపాన్ ను ఓడించింది. ఈ విజయంతో గోల్డ్ మెడల్ గెలవడమే కాదు పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించింది. అటు రికర్వ్ ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో భారత బృందం ఫైనల్‌లో దక్షిణ కొరియా చేతిలో ఓడి రజత పతకంతో సంతృప్తి చెందింది. బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో ప్రణయ్ సెమీస్‌లో ఓడినా..కాంస్య పతకం దక్కింది. భారత మహిళల రికర్వ్ ఆర్చరీ జట్టు వియత్నాంపై గెలిచి కాంస్యం సొంతం చేసుకుంది. సెపక్‌తక్రా ఈవెంట్‌లో భారత మహిళా జట్టు కాంస్యం గెలుచుకుంది. రెజ్లింగ్ లో మూడు పతకాలు వచ్చాయి. పురుషుల 57 కేజీ ఫ్రీస్టైల్ రెజ్లింగ్ లో అమన్ సెహ్రావత్ కాంస్యం, 76కేజీ ఫ్రీస్టైల్ ఈవెంట్ లో కిరణ్ బిష్ణోయి కాంస్యం సాధించారు. అలాగే మహిళల 62కేజీ ఫ్రీస్టైల్ ఈవెంట్ లో సోనం మాలిక్ కాంస్యం సాధించింది.
Also Read: Asian Games 2023: ఆసియా క్రీడల్లో భారత్ జోరు… ఖాయమైన పతకాల సెంచరీ