చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోవడానికి ప్రాయశ్చిత్తంగా… బ్రాహ్మణుల పాదాలు కడగడం వివాదస్పదంగా మారింది. కానీ అలా వారి పాదాలు కడగాల్సిన అవసరం ఏమీ లేదని కేరళలోని కొచ్చిన్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఈ విషయంలో భక్తులపై ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పింది. పూజలో భాగంగా ఇష్టం ఉన్న కొందరు భక్తులు ఇలా చేస్తుంటారని వివరించింది. ఈ మేరకు కేరళ హైకోర్టులో అఫిడవిట్ సమర్పించింది.
ఈ దేవస్థానం బోర్డు త్రిపునితరలో శ్రీపూర్ణథరయీశ దేవాలయాన్ని నిర్వహిస్తోంది. అక్కడ భక్తులు పాప ప్రక్షాళన కోసం పంత్రాండు నమస్కారం అనే పూజను జరుపుతుంటారు. అందులో భాగంగా 12 మంది బ్రాహ్మణుల పాదాలను కడగాల్సి ఉంటుంది. ఇలా కాళ్లను కడగడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో పూజలో ఈ తంతు తప్పనిసరి భాగమేమీ కాదని దేవస్థానం బోర్డు హైకోర్టుకు తెలిపింది.
భక్తులు బ్రాహ్మణుల పాదాలను కడుగుతున్న విషయమై వచ్చిన వార్తను ఆధారంగా చేసుకొని హైకోర్టు సుమోటోగా కేసు విచారణ చేపట్టింది. దీనిపై తమ వైపు నుంచి వాదనలు వినిపించుకోవడానికి అఖిల కేరళ తంత్రి మండలం అనే సంస్థకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీనిపై అఫిడవిట్లు సమర్పించుకోవచ్చని తెలిపింది. భక్తులు కాకుండా పూజారే మిగిలిన బ్రాహ్మణుల పాదాలు కడుగుతారంది.
దేవస్థానం బోర్డు.. హైకోర్టుకు ఈ పూజకు చెందిన సంప్రదాయాలను వివరించనుంది. తుది తీర్పు వచ్చే వరకు భక్తులు ఎవరూ బ్రాహ్మణుల పాదాలు కడగకుండా చూడాలని హైకోర్టు ఇదివరకే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కూడా వాదనలు వినిపించనుంది.