Artemis – II : 50 ఏళ్ల తర్వాత.. చంద్రునిపైకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాములు

50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిపైకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల పేర్లను నాసా ప్రకటించింది. ఈ లిస్టులో వ్యోమగాములు క్రిస్టినా కోచ్, విక్టర్ గ్లోవర్, రీడ్ వైజ్‌మన్, జెరెమీ హాన్సెన్‌లు ఉన్నారు.

Artemis – II : 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చంద్రుడిపైకి వెళ్లనున్న నలుగురు వ్యోమగాముల పేర్లను నాసా ప్రకటించింది. ఈ లిస్టులో వ్యోమగాములు క్రిస్టినా కోచ్, విక్టర్ గ్లోవర్, రీడ్ వైజ్‌మన్, జెరెమీ హాన్సెన్‌లు ఉన్నారు. ఈ నలుగురు 2024లో యునైటెడ్ స్టేట్స్ నుంచి ప్రారంభించనున్న ఆర్టెమిస్ – II మిషన్‌తో చంద్రుని చుట్టూ తిరుగుతారు. ఇంతకుముందు 50 ఏళ్ల కింద (1972లో) అపోలో మిషన్ లో భాగంగా వ్యోమ గాములు చంద్రయాత్రకు వెళ్ళొచ్చారు. మళ్లీ ఇప్పుడు 5 దశాబ్దాల తర్వాత మూన్ మార్చ్ కు నాసా శాస్త్రవేత్తల టీమ్ రెడీ అవుతోంది.గ్రీకు పురాణగాథల ప్రకారం ఆర్టెమిస్ ఒక (చంద్ర) దేవత. చంద్రుడి మీదకు మనుషుల్ని పంపించే దిశగా గతంలో జరిగిన ప్రయోగం ఆర్టెమిస్ – I.

గతేడాది చివర్లో ఆర్టెమిస్‌ – I ప్రయోగం విజయవంతమైంది. ఈ ప్రయోగంలో భాగంగా లాంచింగ్‌ వెహికల్స్‌లో అత్యంత శక్తిమంతమైన PLS.. మానవ రహిత స్పేస్‌ క్యాప్సూల్‌ ఓరియన్‌ను తీసుకెళ్లింది. ఆర్టెమిస్ – I మిషన్ లో భాగంగా ప్రత్యేకంగా తయారు చేసిన భారీ రాకెట్ ‘స్పేస్ లాంచ్ సిస్టమ్’ను, చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపించేందుకు రూపొందించిన కొత్త స్పేస్ క్యాప్సూల్ ‘ఓరియాన్’ను, దాన్ని నియంత్రించే గ్రౌండ్ కంట్రోల్ సిస్టమ్‌లను యధార్థ పరిస్థితుల్లో పరీక్షించి చూశారు. నాసా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆర్టెమిస్ – I లాంచ్ మొదలుకుని , ఓరియాన్ కాప్స్యూల్ భూమి మీదకు తిరిగి చేరుకునే వరకూ.. మొత్తం 42 రోజుల 3 గంటల 20 నిమిషాల టైం పట్టింది. ఈ ప్రయోగంలో ఓరియాన్ క్యాప్సూల్ (స్పేస్‌క్రాఫ్ట్) మొత్తం 21 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి భూమికి తిరిగొచ్చింది.

 ‘ఆర్టెమిస్ – II’ (Artemis – II) లో ఏం చేస్తారు?

‘ఆర్టెమిస్ – II’ ప్రయోగంలో భాగంగా వ్యోమగాములను స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి పంపిస్తారు. కానీ వారు చంద్రుడి మీద దిగరు. వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణానికి ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎంతవరకూ అనుకూలంగా ఉందనే అంశాలను పరిశీలిస్తారు.ఆర్టెమిస్ కార్ప్స్‌ కోసం తొలుత 18 మంది వ్యోమగాములను ఎంపిక చేశారు. చివరకు వీరిలో నలుగురు వ్యోమగాములు యాత్రకు సెలెక్ట్ అయ్యారు. చంద్రుని చుట్టూ 10 రోజుల పాటు 2.3 మిలియన్ కిలోమీటర్ల ప్రయాణం చేయడం ఆర్టెమిస్ – II లక్ష్యం.ఆ తర్వాత 2025లో ‘ఆర్టెమిస్ – III’ ప్రయోగంలో వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపిస్తారు. ఈసారి తొలి మహిళ కూడా చంద్రుడి మీద అడుగు మోపుతారు.

నాసా.. 2030ల నాటికి అంగారకుడి మీదకు అంతరిక్షయాత్రికులను పంపించటానికి సంసిద్ధమయ్యే క్రమంలో భాగంగా నాసా ఈ మూన్ మిషన్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టెమిస్ – II లో భాగంగా 2030లోగా చంద్రుని ఉపరితలంపై వ్యోమ గాములను దింపి, తిరిగి భూమికి తీసుకొస్తారు. చంద్రుడిపై ఒక స్థిరమైన ఔట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేసి, అంగారక గ్రహంపై మానవ అన్వేషణకు బాటలు వేస్తారు.

Also Read:  Standard Deduction: రూ.50వేల “స్టాండర్డ్ డిడక్షన్” అంటే ఏమిటి? దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి?