Hyderabad : బ‌క్రీద్ రోజు ఒక్క హైద‌రాబాద్‌ లోనే ఎన్ని గోర్రెలు విక్ర‌యిస్తారో తెలుసా..!

  • Written By:
  • Updated On - July 8, 2022 / 01:28 PM IST

హైదరాబాద్‌: బ‌క్రీద్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో నగరంలో పొట్టేళ్లు, గొర్రెలు, మేకలకు డిమాండ్‌ పెరిగింది. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జరిగే పండుగ సందర్భంగా నగరంలో దాదాపు 2 లక్షల గొర్రెలు అమ్ముడయ్యాయి. ఇస్లామిక్ క్యాలెండర్ నెల ధుల్ హిజ్జా 10వ రోజున జరుపుకుంటారు. భారతదేశంలో ఈ పండుగను జూలై 10 నుండి జరుపుకుంటారు. ఈ సందర్భంగా ముస్లింలు గొర్రెలు, పశువులను ఒక పద్ధతిగా బలి ఇస్తారు. మాంసాన్ని మూడు సమాన భాగాలుగా విభజిస్తారు. ఒక భాగం స్నేహితులు, పరిచయస్తులు మరియు బంధువులకు పంపిణీ చేస్తే.. మరొక భాగం పేదలు, నిరుపేదలకు మరియు మిగిలిన భాగాన్ని త‌మ‌కోసం ఉంచుకుంటారు. హైదరాబాద్‌లో తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన గొర్రెల వ్యాపారులు ఈ పండుగ‌కు భారిగా విక్ర‌యాలు జ‌రుపుతారు.

మార్కెట్‌లో దాదాపు 12 కిలోల మాంసం లభించే గొర్రెను రూ.10,000కు విక్రయిస్తున్నారు. సాధారణంగా ప్రజలు ఖుర్బానీ కోసం 11 కిలోల నుండి 14 కిలోల బరువున్న గొర్రెలను కొనుగోలు చేస్తారని జియాగూడ గొర్రెల మార్కెట్ కమీషన్ ఏజెంట్ తాజుద్దీన్ అహ్మద్ అన్నారు. కొంత‌ మంది ఒక్కొక్కటి రూ.20,000 నుండి రూ.50,000 వరకు ఉన్న పెద్ద పొట్టేలును కొనుగోలు చేస్తార‌ని.. వీటిని కనీసం రెండు సంవత్సరాల పాటు యజమానులు ప్రత్యేకంగా పెంచుతారని తెలిపారు. డ్రై ఫ్రూట్స్‌తో కూడిన ప్రత్యేక ఆహారాన్ని తినిపిస్తారు. సంపన్నులు దానిని సామాజిక హోదాకు చిహ్నంగా భావించి కొనుగోలు చేస్తారు, కానీ మతపరమైన ఆచారంతో దీనికి సంబంధం లేదని వ్యాపారి తెలిపారు.

నగరంలోని చంచల్‌గూడ, నానల్ నగర్, మెహదీపట్నం, ఫలక్‌నుమా, ఖిల్వత్, చాంద్రాయణగుట్ట, షాహీన్‌నగర్, కిషన్‌బాగ్, ఆజంపురా, ముషీరాబాద్, గోల్నాక, బంజారాహిల్స్, జెహ్రా నగర్, బోరబండ, ఏసీ గార్డ్స్ తదితర ప్రాంతాల్లో తాత్కాలిక మార్కెట్‌లు ఏర్పాటయ్యాయి. రవాణా ఛార్జీలు పెరగడం వల్ల ధరలు పెరిగడంతో పాటు క‌రోనా వళ్ళ కూడా ధ‌ర‌లు పెర‌గ‌డానికి కార‌ణంగా వ్యాపారులు తెలిపారు. గత రెండేళ్లుగా మహమ్మారి కారణంగా అమ్మకాలు జరగలేదు. అయితే వ్యాపారులు ఇప్పుడు నష్టాన్ని పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని జియాగూడ మార్కెట్‌లోని మరో కమీషన్ ఏజెంట్ రాంచందర్ జీ అన్నారు. దాదాపు రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ధరలు పెరిగాయని తెలిపారు.