Site icon HashtagU Telugu

Highway: రాత్రి నేషనల్ హైవే 65పై ప్రయాణిస్తున్నారా.. జర జాగ్రత్త

National Highways

green field highway

Highway: నేషనల్ హైవే 65. దేశంలోనే అత్యంత వాహనాల రద్దీ కలిగిన హైవేగా దీనికి పేరు ఉంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 181 కిలోమీటర్ల మేర ఈ హైవే విస్తరించి ఉంది. నిత్యం వాహనాల రద్దీతో ఉండే ఈ హైవేపై దోపిడీ దొంగతనాలు జరుగుతున్నాయి. ఆదమరిచి హైవే వెంట పార్క్ చేసి పడుకుంటే మాత్రం అంతే సంగతులు. సాధారణ వ్యక్తుల మాదిరిగానే వచ్చి కత్తులతో బెదిరించి అందిన కాడికి దోచుకుంటున్నారు. వాహనాలను ఆపి దోపిడీ చేస్తున్నారు. కొన్ని రోజులుగా రహదారిపై దొంగతనాలు, దోపిడీలు విపరీతంగా పెరిగిపోయాయి. రాత్రిపూట ప్రయాణాలు అంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. తాజాగా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తున్న వాహనదారులు.. అలసిపోయి స్వాతి హోటల్ వద్ద పక్కకు పార్కు చేసి నిద్రపోయారు. ఇది అదునుగా భావించిన దోపిడీ దొంగలు కారులో రెండు లక్షల రూపాయలను ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో హైవేపై దోపిడీ దొంగల కలకలం రేపింది.

చీకటి పడితేచాలు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు దాబాల ముందు పార్క్ చేయాలంటేనే భయపడిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని బాంబేలేత్తుతున్నారు. గత నెల 18న ఏపీ నుంచి సరకును హైదరాబాద్‌లో దిగుమతి చేసి తిరిగి వెళ్తున్న క్రమంలో అలసిపోయి కట్టంగూరు మండలం ఎర్రసానిగూడెం వద్ద పార్కింగ్‌ స్థలంలో ఆపిన మినీ డీసీఎం డ్రైవర్‌ హత్యకు గురయ్యాడు. దుండగులు అతని కాళ్లను కట్టేసి, గొంతు నులిమి దారుణంగా హత్య చేసి అవతలి వైపు రహదారి పక్కన పడేశారు. మే 19 తేదీన అదే ప్రాంతంలో ఆగి ఉన్న లారీ నుంచి 250 లీటర్ల డీజిల్‌ను దొంగతనం చేశారు. 23వ తేదీన కట్టంగూర్ మండలం అయిటిపాముల వద్ద మరో దొంగతనం చేశారు.