Apple Engineer: ఆఫీస్ కు రమ్మంటే రాజీనామాలు చేస్తున్నారు!

కరోనా కాలంలో అన్ని టెక్ కంపెనీలు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ బాట పట్టాయి.

  • Written By:
  • Publish Date - May 10, 2022 / 06:30 PM IST

కరోనా కాలంలో అన్ని టెక్ కంపెనీలు పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ బాట పట్టాయి. దాదాపు గత రెండేళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ కు అలవాటుపడిన ఎంతోమంది ఐటీ ఎంప్లాయీస్ ఇప్పుడు ఆఫీస్ కు రమ్మని పిలిస్తే.. రాలేమని తేల్చి చెబుతున్నారు. ఈ జాబితాలో మధ్య, దిగువ స్థాయి ఉద్యోగులే కాదు.. ఉన్నత స్థాయి అధికారులు కూడా ఉన్నారు. తాజాగా యాపిల్ కంపెనీ మెషీన్ లెర్నింగ్ విభాగం డైరెక్టర్ ఇయాన్ గుడ్‌ఫెల్లో కూడా తన కంపెనీ హెచ్ఆర్ కు ఇదే విధమైన జవాబు చెప్పారు.

కుటుంబానికి దగ్గరగా ఉంటూ పని చేయడం అలవాటు అయిపోయిందని ఆయన స్పష్టం చేశారు. ఆఫీస్ కు రావాల్సిందే అని బలవంతం చేస్తే .. రాజీనామా చేస్తానని తేల్చి చెప్పారు.ఇయాన్ గుడ్‌ఫెల్లో ఈ మాటలు చెప్పడమే కాదు. ఏకంగా ఉద్యోగానికే రాజీనామా చేశాడు. యాపిల్ కంపెనీ తమ ఉద్యోగులను ఇంటి నుంచి ఆఫీస్ కు రప్పించేందుకు ఇటీవల ఒక స్కీం ప్రకటించింది. దీనిప్రకారం..ఏప్రిల్ 11 నుంచి వారానికి ఒకసారి ఆఫీస్ కు రావాలి. మే 2 నుంచి వారానికి రెండుసార్లు ఆఫీస్ కు రావాలి. మే 23 నుంచి మాత్రం వారానికి మూడుసార్లు ఆఫీస్ కు రావాలి. మరో రెండు వారాల్లో వారానికి మూడుసార్లు ఆఫీస్ కు వెళ్లాల్సి ఉండటంతో ఇయాన్ గుడ్‌ఫెల్లో యాపిల్ లో తన జాబ్ కు రాజీనామా చేశాడు. యాపిల్ కంపెనీ మెషీన్ లెర్నింగ్ విభాగం డైరెక్టర్ పదవినీ గడ్డిపోచలా వదిలేశాడు.

యాపిల్ సీఈవో కు ఉద్యోగుల లేఖ..

యాపిల్ ఉద్యోగులు ఆ కంపెనీ సీఈవో టిమ్ కుక్‌కు లేఖ రాశారు. “ఒక్కసారిగా కార్యాలయానికి రావాలంటే ఇబ్బందిగా ఉంది.. కుటుంబాలను వదిలి రావాల్సి ఉంటుంది కదా.. ఇళ్ల నుంచి చాలా చక్కగా పనిచేస్తున్నాం. మేం కంపెనీలో భాగం.. కానీ ఆఫీసుకు రావాలనే నిర్ణయాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నాం. మా వినతిని తేలికగా తీసుకోవద్దు” అని లేఖలో ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.