TDP : ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల్లో అందుకే పోటీ చేయ‌డం లేదు – ఏపీ టీడీపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు

  • Written By:
  • Updated On - June 13, 2022 / 02:55 PM IST

శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మరణించిన స్థానాల్లో జరిగే ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకూడదనే ఉత్తమ సంప్రదాయాన్ని పాటిస్తోందని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఇప్పుడు ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తోందని.. మరణించిన సభ్యుని కుటుంబీకులే ఉపఎన్నికల్లో పోటీ చేస్తే పోటీ నిలబెట్టకుండా ఎన్నికలకు దూరంగా ఉండే సంప్రదాయానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 1999లో నల్గొండ జిల్లా, దేవరకొండ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే ధీరావత్ రాగ్యానాయక్ చనిపోతే.. 2002లో ఉప ఎన్నికలు జరిగాయని… ఆ ఎన్నికల్లో ఆయన భార్య ధీరావత్ భారతి నాయక్ అభ్యర్ధిగా నిలబడినప్పుడు టీడీపీ అధికారంలో ఉండి కూడా పోటీ చేయలేదన్నారు. నంద్యాల లోక్ సభ ఉపఎన్నికల్లోనూ పోటీ చేయకుండా.. తెలుగు వ్యక్తి పి.వి.నరసింహరావు ప్రధానిగా ఎన్నికయ్యేలా చేశామ‌ని అచ్చెన్నాయుడు అన్నారు. 2009లో వై.ఎస్.రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఆ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో వై.ఎస్.విజయమ పోటీ చేసినపుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్ధిని నిలబెట్టలేదని ఆయ‌న గుర్తు చేశారు.

2021 తిరుపతి వైసీపీ ఎంపీ దుర్గాప్రసాద్ చనిపోతే.. జగన్ మోహ‌న్ రెడ్డి ఆ కుటుంబంలోని వ్యక్తికి కాకుండా ఇతరులకు సీటు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశామ‌ని… ఇప్పుడు ఆత్మకూరు ఉపఎన్నికల అభ్యర్ధిగా మేకపాటి గౌతంరెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తులే ఉన్నారు. అందువలన మా సాంప్రదాయాన్ని పాటిస్తూ.. పోటీకి దూరంగా ఉన్నామ‌ని తెలిపారు.. మేకపాటి కుటుంబానికి కాకుండా వేరే వారికి సీటు కేటాయిస్తే.. తెలుగుదేశం పార్టీ తప్పక పోటీలో నిలబడుతుందని తెలిపారు. పోటీపై సవాళ్లు చేస్తున్న జగన్ రెడ్డి అండ్ గ్యాంగ్ చిత్తశుద్ధి ఉంటే మరణించిన శాసనసభ్యుల స్థానాల్లో పోటీపై టీడీపీ విధానం ఏమిటో స్పష్టంగా చెప్పామ‌ని..వైసీపీ కూడా తమ విధానం ఏమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు.