ఏపీలో జైలు మరణాలు 84 శాతం పెరిగాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సోమవారం విడుదల చేసిన ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియా (పిఎస్‌ఐ) నివేదిక ప్రకారం 2020లో ఇలాంటి సంఘటనలు 46 నమోదయ్యాయి. 2019లో 25 జరిగాయి.
ఈ నివేదిక ప్రకారం దేశంలో మొత్తం 1,887 మంది ఖైదీలు జ్యుడిషియల్ కస్టడీలో మరణించారు. వారిలో 1,642 మంది సహజ మరణాలు కాగా.. 189 మంది అసహజ కారణాల వల్ల మరణించారు. 56 కేసుల్లో మరణాలకు కారణాలు ఇంకా తెలియరాలేదు. సహజ మరణాలు 87 శాతం (1,887లో 1,642), అసహజ మరణాలు మొత్తం గణనలో 10 శాతం (1,887లో 189) ఉన్నాయి.
1,542 మంది సహజ మరణాలు గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ సమస్యలు, క్షయ, క్యాన్సర్, కాలేయ సమస్యలు ఇతర అనారోగ్యాల వల్ల సంభవించాయని.. మిగిలిన 100 మంది వృద్ధాప్యం కారణంగా మరణించారని నివేదిక వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 46 మరణాలలో 39 మరణాలు ప్రధానంగా వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా సంభవించిన సహజ మరణాలు కాగా.. మరో ఏడుగురిని అసహజ మరణాలుగా నివేదిక పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 434 మంది మరణించగా.. పశ్చిమ బెంగాల్‌లో 148 మంది, బీహార్‌లో 140 మంది మరణించారు. జైలు మరణాల్లో ఆంధ్రప్రదేశ్ 14వ స్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది.
ఖైదీల్లో విద్యను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని జైళ్లలో ‘ఖైదీ అక్షరాస్యత’ కార్యక్రమాన్ని అనుసరిస్తోందని నివేదిక పేర్కొంది. కార్యక్రమంలో భాగంగా ఖైదీలందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక, మాధ్యమిక విద్యను అందించేందుకు కొన్ని జైళ్లలో ఉపాధ్యాయులను నియమించారు. ఆంధ్రా యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (NIOS), అంబేద్కర్ యూనివర్సిటీ మరియు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ వంటి ఓపెన్ యూనివర్సిటీలు గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను అందజేస్తున్నాయి. అదనంగా పరీక్షలలో విజయం సాధించిన ఖైదీలకు ప్రత్యేక ఉపశమనాన్ని అందజేస్తున్నారు.