AP Pensions : ఆంధ్రప్రదేశ్‌లో అనర్హులకూ పెన్షన్లు అందుతున్నట్లు బయటపడింది. ప్రతీ 10 వేల మందిలో దాదాపు 500 మంది అర్హత లేని వారు పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. అనర్హులకు పెన్షన్లు అందుతున్నాయనే ఫిర్యాదులపై నిర్వహించిన సర్వేలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. గత ప్రభుత్వ కాలంలో, ముఖ్యంగా ఎన్నికల ముందు, 6 లక్షల మందికి పెన్షన్లు మంజూరు చేయడం జరిగింది. వీరిలో చాలా మంది అనర్హులేనని, ఇది ఆ సమయంలో తీసుకున్న హడావుడి నిర్ణయాల ఫలితమని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రతి పెన్షన్‌ను జిల్లా కలెక్టర్ల ద్వారా మూడు నెలల్లోగా పరిశీలించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకంపై ఫోకస్
సీఎం చంద్రబాబు నాయుడు గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) పనుల ప్రగతిని సమీక్షించారు. వంద రోజుల పనిదినాలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల మెటీరియల్ కాంపోనెంట్ సబ్సిడీ రాకుండా పోతుందని చెప్పారు. పల్లె పండుగలో పనులు కేవలం 14.8 శాతం పూర్తయ్యాయని, అల్లూరి జిల్లాలో 54 శాతం పనులు పూర్తయ్యాయని, కానీ మరో జిల్లాలో కేవలం 1.6 శాతం మాత్రమే పనులు జరగడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు. జల జీవన్ మిషన్‌ను గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిర్వహించిందని ఆరోపించిన సీఎం, గ్రామీణ ప్రాంతాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు అందించడంలో ప్రాధాన్యత చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రత్యేకంగా పెన్షన్లు అందించాలని సూచించిన సీఎం, దివ్యాంగుల కోసం 15 వేల పెన్షన్ డిమాండ్లపై దృష్టి సారించారు. అర్హులకే ధృవీకరణ పత్రాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తన సమీక్షలో పని పూర్తయిన వెంటనే బిల్లులు చెల్లించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. కలెక్టర్లు నిర్లిప్తంగా వ్యవహరించడం సరికాదని హెచ్చరించారు. ఈ చర్యలన్నీ పారదర్శకతను పెంపొందించడంతో పాటు, అర్హులకు మాత్రమే సంక్షేమ ఫలాలు అందించే దిశగా నడిపించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.