Site icon HashtagU Telugu

AP Minister: అన్ని రకాల పంటలకు ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు

Atchainnaidu

Atchainnaidu

AP Minister: రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, డెయిరీ డెవలప్మెంట్, మత్స్య శాఖల మంత్రివర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఉద్యాన శాఖ, మత్స్య శాఖ, పశుసంవర్ధక & పాడిపరిశ్రమ శాఖల అధికారులతో విజయవాడ పశుసంవర్ధక శాఖ డైరెక్టరేట్ లో మంగళవారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీతో రైతులకు మేలు జరుగుతుందని.. రాష్ట్రంలో అధిక విస్తీర్ణంలో పండుతున్న వివిధ రకాల పంటలకు ప్రాససింగ్ యూనిట్ల ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. గత ప్రభుత్వంలో ఉద్యాన రైతులు రాయితీలు అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఉద్యాన సాగు విస్తీర్ణం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు రాయితీలు సకాలంలో అందే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఆయిల్ పామ్ విస్తీర్ణం పెంపుతో పాటు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. దీర్ఘకాలిక పంటలు పండించే రైతులు అంతర పంటలు సాగు చేసేందుకు ప్రోత్సహించాలని సూచించారు. మత్స్య సంపద వృద్ధికి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా మత్స్య సంపద అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాయితీలో మత్స్యకారులకు మినీ కోల్డ్ స్టోరేజ్ లు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. మత్స్యకారులకు రాయితీలో బోట్లు, పరికరాలు అందించడంతో పాటు ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన పథకం నూరు శాతం వినియోగించుకోవాలని తెలిపారు.