విద్యాహక్కు చట్టం (RTE) ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు పిల్లలకు ఉద్దేశించబడినది. నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో మొదటి తరగతిలో 25శాతం సీట్లను ఉచితంగా కేటాయించి..భర్తీ చేయడంలో సర్కార్ తీరు సరిగ్గా లేదంటూ ఏపీ హైకోర్టు మొట్టికాయలు వేసింది. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఈ సీట్లను ఇవ్వాలంటూ తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకుండా ప్రైవేటు పాఠశాలలకు పరోక్షంగా సాయపడేలా ప్రభుత్వ తీరు ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
పేదవిద్యార్థుల భవిష్యత్తుతో ఎందుకు ఆడుకుంటున్నారంటూ సర్కార్ ను నిలదీసింది. మాటలు చెప్పడం కాదు చేతలు చేసి చూపించాలంటూ హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పేదపిల్లలకు 25శాతం కేటాయించి భర్తీ చేసినట్లు రుజువులు చూపించనట్లయితే మీరు జైళ్లో ఉంటారంటూ సీఎస్ తోపాటు పాఠశాల విద్యా ముఖ్యకార్యదర్శి, కమిషనర్ ను హెచ్చరించింది. విద్యార్థులు పాఠశాలలో ఉండాలి లేదంటే అధికారులు జైల్లో ఉండాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంతమంది పిల్లలకు స్కూల్లో ప్రవేశాలు కల్పించారన్న వివరాలు తీసకురండి అంటూ ఆదేశాలు జారీ చేసింది. వివరాలు సరిగ్గా లేనట్లయితే వ్యక్తిగత హాజరుకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది హైకోర్టు..