తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందంటూ టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. వంగవీటి రాధా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని.. పోలీస్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.
కొన్నిరోజుల కిందట తన తండ్రి రంగా వర్ధంతి సభలో వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ మంత్రి కొడాలి నాని… రాధా వ్యాఖ్యలను సీఎం జగన్ ను దృష్టికి తీసుకెళ్లగా, 2 ప్లస్ 2 భద్రత కల్పించాలని ఆయన ఆదేశాలు ఇచ్చారు. రాధా వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ డీజీకి సీఎం జగన్ ఆదేశించారు. కాగా రాధా వ్యాఖ్యల నేపథ్యంలో తమకు ఇంతవరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని విజయవాడ పోలీసులు అంటున్నారు.