Site icon HashtagU Telugu

TTD: మూడో ఘాట్ రోడ్డుతో అడవులకు విఘాతం

Tirumala Ghat

Tirumala Ghat

తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలకు మూడో ఘాట్‌ రోడ్డు ప్రతిపాదనను నిలిపివేయాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై.గోపి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం సమీపంలోని రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. మామండూరు నుంచి ప్రారంభమయ్యే మూడో ఘాట్‌ రోడ్డు తిరుపతి అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని గోపి ఆరోపించారు. ఆతిథ్య రంగంతో పాటు వ్యాపార సంస్థల ప్రయోజనాలకు గండి పడుతుందని.. అలాగే ఘాట్‌ రోడ్డు వేయడం వల్ల అడవులకు విఘాతం కలుగుతుందన్నారు. అనేక అరుదైన జాతుల జంతువులు, చెట్లు అంత‌రించిపోయే అవ‌కాశం ఉంద‌ని.. దీంతో పాటు ఎర్ర చంద‌నం అక్రమ రవాణాకు ఇది మ‌రింత‌ ఊతమిస్తున్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు.

తిరుపతి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ యాజమాన్యం మూడో ఘాట్ రోడ్డు ప్రతిపాదనను విరమించుకోవాలని.. లేనిపక్షంలో టీటీడీ యాజమాన్యం ఆ ప్రతిపాదనను ఉపసంహరించుకునేలా కాంగ్రెస్ పార్టీ దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందన్నారు. మరోవైపు మూడో ఘాట్‌ రోడ్డు ప్రతిపాదనను టీటీడీ విరమించుకోవాలని రాయలసీమ ఇంటలెక్చువల్‌ ఫోరం (ఆర్‌ఐఎఫ్‌) కన్వీనర్‌ ఎం. పురుషోత్తంరెడ్డి డిమాండ్‌ చేశారు. పర్యావరణ అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ స్వయంగా ఘాట్‌రోడ్డు ప్రతిపాదనను ఉపసంహరించుకుని తిరుమలకు పాదచారుల అన్నమయ్య మార్గం ఏర్పాటుకే పరిమితం చేయాలని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.