Site icon HashtagU Telugu

AP CM: రోడ్ల పక్క దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలి

cm jagan

రోడ్డు భ‌ద్ర‌త‌పై ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ట్రామా కేర్ సెంట‌ర్లు ఏర్పాటు చేసేందుకు ఆయ‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం ఉమ్మడి డ్రైవింగ్‌ స్కూల్ ఏర్పాటుతో పాటు.. కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలో ట్రామా కేర్‌ సెంటర్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్‌ కాలేజీల్లోనూ ట్రామా కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యాధునిక పద్ధతుల్లో ఎమర్జెన్సీ సర్వీసులు ఉండాలని.. ప్రమాదాలకు గురైన వారు కోలుకునేందుకు వీలుగా వైజాగ్ లో రీహాబిలిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుపతి బర్డ్‌ ఆస్పత్రుల్లో ఉన్న సెంటర్‌ను మెరుగుపరచాలని.. రోడ్డుపై లేన్‌ మార్కింగ్‌ చాలా స్పష్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. బైక్‌లు, ఫోర్‌వీల్‌ వాహనాలకు ప్రత్యేక లేన్స్‌ ఏర్పాటు పై ఆలోచన చేయాలన్న జగన్‌.. ఎంత స్పీడులో వెళ్ళాలో సైన్‌ బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. చాలా వరకు ప్రమాదాలు తగ్గే ఆస్కారం ఉంటుందని.. ప్రమాదాల నివారణకు రోడ్ల పక్క దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.