అమరావతి రాజధాని బదులుగా మున్సిపాలిటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డి సర్కార్ సిద్ధం కావడాన్ని దొండపాడు ప్రజలు తిరస్కరించారు. ప్రజాభిప్రాయం కోసం తొలి రోజు దొండపాడులో ఏర్పాటు చేసిన గ్రామసభలో ప్రజలు తిరగబడ్డారు. రాజధాని కేంద్రాన్ని మున్సిపాలిటీ కింద మార్చడం ఏమిటని నిలదీశారు. భూములు ఇచ్చిన రైతులు గ్రామ సభ నిర్వహించిన అధికారులపై తిరగబడ్డారు. సీఆర్డీయే ఉందా? లేదా? అంటూ నిలదీశారు. భూములు ఇవ్వని గ్రామాలను కూడా అమరావతి మున్సిపాలిటీలో కలపడం ద్వారా రైతుల్ని విభజించడానికి ప్రభుత్వం కుట్ర కు పాల్పడుతోందని భావిస్తూ గ్రామసభను అక్కడి ప్రజలు వ్యతిరేకించారు.
రాజధాని పరిధిలోని 29 గ్రామాలకుగాను, 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. అందుకోసం స్థానిక ప్రజల ద్వారా అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి గ్రామ సభలను నిర్వహిస్తోంది. ఈనెల సెప్టెంబర్ 17వ తేదీ వరకు వివిధ గ్రామాల్లో సభలను నిర్వహించనున్నారు. తొలి రోజు దొండపాడులో నిర్వహించిన సభలో అధికారులపై రైతులు తిరగబడ్డారు.
అమరావతిని మున్సిపల్ కార్పొరేషన్‌గా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇప్పుడు 22 గ్రామాలతో మునిసిపాలిటీగా అభివృద్ధి చేయాలని భావిస్తోంది. గతంలో మంగళగిరి-తాడేపల్లి ప్రాంతాలను కలుపుతూ కార్పొరేషన్ గా చేసింది. ఇదే తరహాలో ఈ ఏడాది జనవరిలో అమరావతిలోని 19 గ్రామాలతో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించగా, గ్రామస్థుల సమ్మతి కోసం గ్రామసభలు నిర్వహించారు. మెజారిటీ గ్రామాలు ఆ ప్రతిపాదనను వ్యతిరేకించాయి. బదులుగా మొత్తం 29 గ్రామాలను AMCలో చేర్చాలని కోరాయి. దీంతో ప్రభుత్వం ఆ ప్రతిపాదనను నిలిపివేసింది.
ల్యాండ్ పూలింగ్ పథకం కింద 34,000 మంది రైతులు భూములను అమరావతి కోసం అందించారు. వారిలో ఎక్కువ మంది ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కోరుతున్నారు. కానీ, తుళ్లూరు మండలానికి చెందిన 19 గ్రామాలు ప్లస్ మంగళగిరి మండలంలోని మూడు గ్రామాలతో వెరసి 22 గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తోన్న అధికారులకు చమటలు పడుతున్నాయి. రాజధాని ప్రాంతాన్ని కార్పొరేషన్ చేయాలని ప్రయత్నించిన జగన్ సర్కార్ కొంత వరకు విజయం సాధించింది. ఇప్పుడు 22 గ్రామాలతో మున్సిపాలిటీని చేయడం ద్వారా సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకు , రాజధాని రైతుల నుంచి ఎదురవుతోన్న ప్రతిఘటన ఎంత వరకు ఫలిస్తుందో చూడాలి.