AP Cabinet: నేడు కొత్త కేబినెట్ తొలి సమావేశం

మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత రాష్ట్ర కేబినెట్‌ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది.

Published By: HashtagU Telugu Desk
cm jagan

మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత రాష్ట్ర కేబినెట్‌ ఇవాళ తొలిసారి సమావేశం కానుంది. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. దేవాదాయశాఖలో 2 లక్షల ఎకరాల ఆక్రమణలకు సంబంధించిన అంశంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దిశా చట్టంపై సవరణలకు సంబంధించిన అంశాలను సమీక్షించి కేంద్రానికి పంపుతారని సమాచారం. అమ్మ ఒడి పథకం గడపగడపకూ మన ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సంబంధించి సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏపీ పునర్ వ్యవస్థీకరణ తర్వాత మొదటిసారి సమావేశం కానుండటంతో ఆసక్తి నెలకొంది.

ఇటు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి బుధవారం రోడ్లపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, ఆర్‌అండ్‌బీ మంత్రి దాడిశెట్టి రాజా, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని… ఒక పద్ధతి ప్రకారం అభివృద్ధిలో ముందుకు సాగుతోందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం, అధికారులు ఎంతో కష్టపడి రోడ్లను ఎక్కడా గుంతలు లేని విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఏడాదిలోగా రోడ్ల విషయంలో గణనీయమైన పురోగతి సాధించాలని ఆదేశించి, రూ. 2,500 కోట్లు రోడ్లు మరియు భవనాలకు మంజూరు చేయబడ్డాయ‌ని.. సుమారు రూ. 1072.92 కోట్లు పంచాయ‌తీరాజ్ రోడ్ల‌కు కేటాయించిన‌ట్లు సీఎం జ‌గ‌న్ తెలిపారు.

  Last Updated: 12 May 2022, 12:08 PM IST