Vande Bharat: వందే భారత్ రైలుకు మరో ప్రమాదం..!!

వందేభారత్ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది.

  • Written By:
  • Updated On - October 29, 2022 / 05:13 PM IST

వందే భారత్ రైలు మరోసారి ప్రమాదానికి గురైంది. ముంబై-గాంధీనగర్ వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ శనివారం ఉదయం గుజరాత్‌లోని అతుల్ స్టేషన్ సమీపంలో పశువులను ఢీకొట్టడంతో గమ్యస్థానానికి చేరుకోవడంలో 20 నిమిషాలు ఆలస్యమైందని రైల్వే అధికారి తెలిపారు. ఈ ప్రమాద ఘటన వల్ల రైలు ముందు ప్యానెల్ దెబ్బతినడంతో పాటు మొదటి కోచ్‌లోని అండర్ బెల్లీ పరికరాలు కూడా దెబ్బతిన్నాయని రైల్వే వర్గాలు తెలిపాయి.

అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్‌పైకి వచ్చిన పశువులను రైలు ఢీకొట్టింది. ఈ ఘటన కారణంగా రైలు దాదాపు 20 నిమిషాల పాటు నిలిచిపోయిందని, తర్వాత గాంధీనగర్ వైపు తిరిగి తన ప్రయాణాన్ని ప్రారంభించిందని రైల్వే అధికారి చెప్పారు. “రైలుకు ఎటువంటి ఆపరేషనల్ డ్యామేజ్ జరగలేదు. ప్రమాదం జరిగిన 20 నిమిషాల తర్వాత తదుపరి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించింది” అని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు. ఈ ఘటనలో రైలులోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని తెలిపారు.

అక్టోబర్ 6న గుజరాత్‌లోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య ముంబై నుంచి గాంధీనగర్‌కు వెళ్తుండగా వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని నాలుగు గేదెలు చనిపోయాయి. మరుసటి రోజు (అక్టోబర్ 7) జరిగిన రెండవ సంఘటనలో రైలు ముంబైకి వెళుతుండగా గుజరాత్‌లోని ఆనంద్ సమీపంలో ఒక ఆవును ఢీకొట్టింది. స్వదేశీంగా రూపొందించబడిన సెమీ-హై స్పీడ్ రైలు వందే భారత్ సిరీస్‌లో మూడవ సర్వీస్ ను గాంధీనగర్ నుండి సెప్టెంబర్ 30న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.